ప్రముఖ రచయిత సిహెచ్ మధు కన్నుమూశారు. ఆయనకు నివాళి ఆర్పిస్తూ వి. శంకర్ ఆయన రచనా వైశిష్ట్యాన్ని తెలియజేశారు. ఆ నివాళి వ్యాసం చదవండి.
రచయిత: డాక్టర్ వి.శంకర్
మనిషిపై కర్కశంగా దాడి చేస్తున్న ఈ విషాదకాలం నిన్న ఇందూరు అక్షర యోధున్ని తన వెంట తీసుకెళ్ళిపోయింది. తెలంగాణా సాహిత్యరంగంపై తనదైన ముద్ర వేసిన ఓ సాహిత్యకారుని ప్రస్థానం ముగిసిపోయింది. ప్రజారచయిత, సీనియర్ పాత్రికేయుడు, నిబద్దుడైన కవి, కథా, నవలా రచయిత, సామాజిక ఉద్యమ కార్యకర్త సిహెచ్.మధు (78) నిన్న కరోనా కాటుతో అస్తమించారు. నిజానికి ఆయన గత ఏడాదికి పైగా క్యాన్సర్ మహమ్మారితో కూడా పోరాడుతున్నారు. ఆయనను, ఆయన రచనలను ప్రేమించే సాహితీమిత్రుల తోడ్పాటుతో ఆ వ్యాధిని దాదాపుగా జయించారు. చావు గుమ్మంలోకి వెళ్ళినా అజేయుడై తిరిగి వచ్చారు. కానీ కరోనా కనికరించలేదు. ఆయనను గద్దలా తన్నుకుపోయి నిజామాబాదు జిల్లా సాహితీ మిత్రులను విషాదంలో ముంచింది.
సిహెచ్.మధు అసలు పేరు చందుపట్ల విట్టల్. మెదక్ జిల్లా రామాయంపేటలో నారాయణ, బాలవ్వ దంపతులకు జన్మించారు. నిజామాబాదులో స్థిరపడ్డారు. నిరంతర సాహిత్య, సామాజిక అధ్యయనంతో తనను తాను ప్రగతివాద రచయితగా మలచుకున్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, ఎమర్జెన్సీ పరిస్థితులు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. సమాజంలోని అసమానతలు, అన్యాయాలు ఆయనను కలం పట్టేలా పురికొల్పాయి. నిత్య సంఘర్షణలతో కూడిన సమాజానికి సాహిత్యమే దిక్సూచి కావాలని, సామాజిక చైతన్యానికి తిరుగులేని సాధనంగా సాహిత్యాన్ని గుర్తించారు. అందుకు అనుగుణంగా తన సాహిత్య వ్యక్తిత్వాన్ని మలచుకున్నారు. కథ, కవిత్వం, నవల, వ్యాసం వంటి ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. పత్రికారంగంలోకి ప్రవేశించారు. ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి 'జలపాతం' పేరుతొ చాలా కాలం పత్రిక నడిపించారు. అమృతలత స్థాపించిన ‘అమృత్ కిరణ్’ దినపత్రికకు కొంతకాలం సంపాదకులుగా పనిచేసారు.
సిహెచ్. మధు వ్యక్తిత్వం చాలా విశిష్టమైనది. ఆయన నిరాడంబరత, నిబద్ధత ఇతరులకు సాధ్యం కానివి. ఒక పక్క పేదరికం నక్షత్రకునిలా వేధిస్తున్నా తాను నమ్మిన విలువలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. సన్మానాలు, సంపదల కోసం ఎన్నడూ ఆశపడలేదు. తన ఆకలిని కడుపులోనే దాచుకొని సమాజంలోని ఆకలి గురించి ఆలోచించారు. సమకాలీన సంఘటనలకు స్వచ్ఛమైన మానవతావాదిలా స్పందించేవారు. ఆయన అన్ని రచనల్లో అది ప్రతిబింబించింది.
కథా రచయితగా తెలుగు సాహిత్యంలో ప్రవేశించిన సిహెచ్.మధు మొదటి కథ ‘హెరిటేజ్ ఆఫ్ సారో’ 1969లో అచ్చయింది. ప్రజాసాహితిలో వచ్చిన ‘చెదలు’ కథపై కొన్ని నెలల పాటు చర్చ జరిగింది. అందులోనే ఆయన ఏడు ఉద్యమ కథలు ప్రచురించబడ్డాయి. వీరి ‘తూరుపు ఎరుపులో మహిళ’ స్వాతి నవలల పోటీలో బహుమతి గెలుచుకున్నది. ముసలోడు, వ్యవస్థ, శాంతి అనే కథలు ఆంధ్రజ్యోతిలో వచ్చినయి. ‘ముళ్ళు వద్దు రాళ్ళు వద్దు డబ్బు కావాలి’ కథ మయూరి పత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది. ఇట్లా అనేక కథలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.
1978లో జరిగిన ఫ్రీవర్స్ ఫ్రంట్ సాహిత్య సదస్సులో పాల్గొన్న సిహెచ్ మధు కుందుర్తి ఆంజనేయులు సమక్షంలో ‘జీవితం/ గాలి’ అనే రెండు పదాల కవిత చదివి ప్రశంసలందుకున్నారు.
సిహెచ్.మధుకు ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని అన్ని అభ్యుదయ సంస్థలతో అనుబంధం ఉంది. సామాజిక ఉద్యమాలలో భాగస్వామ్యం ఉంది. కామారెడ్డిలో ఆదర్శ కళా సమితి ప్రచురించిన ‘కొత్తమలుపు’ సంకలనంలో ‘ఆకాంక్ష’ కవితలో ‘చైతన్యం కళ్ళజోడు పెట్టుకో/ అన్యాయం లోతు చూడు’ అనే ‘ఆకాంక్ష’ను వ్యక్తం చేసారు. ‘గొర్రెగా బతికితే, కర్రతో బెదిరిస్తారు’ జీవితంలోని చీకట్లను తొలగించుకోవడానికి ‘ఆశల చుక్కలు చూడు’ అంటారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా మధు ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి తెలంగాణ రచయితల వేదిక ‘గాయి’ సంకలనంలో ఆయన కవిత ‘కోటి గాయాల తెలంగాణ’ ఉన్నది. ఒకప్పుడు కోటి గేయాలు వినిపించిన తెలంగాణా ఇప్పుడు కోటి కన్నీళ్ళ వరదగా ఎందుకు మారింది. కారణాలు అడుగుతున్నాడు. ‘తెలంగాణ ఒక కన్నీటి గీతమే కాదు, అది పోరాతగీతం కూడా’ అని ప్రకటిస్తారు. భాషా, సంస్కృతులు ఒకటే అనే పేరుతొ తెలంగాణ పై పెత్తనం కుదరదన్నారు.
‘తెలంగాణ నీళ్ళు నోళ్ళు
చైతన్యానికి సంకేతం వెలుగుకు అంకితం
నిప్పురవ్వ బూడిదను దులుపుకుంటూ పైకి లేస్తుంది’ అంటారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ముందే రాయబారం విఫలమవుతుందని చెప్పినాడు.
‘రాయబారం విఫలమవుతుందని నాకు తెలుసు
యుద్ధానికి సిద్ధమవుతున్నాం
నా తెలంగాణ మట్టిలో నా వాళ్ళ రక్తం చిన్దద్దని నాకుంది...
ఈ రాత్రి నిశ్శబ్దం నిరీక్షణ
తెలంగాణ సూర్యుడు, తూర్పున ఉదయించాల్సిందే’ (ఒకటే మాట తెలంగాణ)
అయితే ఇన్ని రచనలు చేసిన సిహెచ్.మధు తన రచనలను పుస్తక రూపంలో తేలేకపోయారు. ఆయన మిత్రుల ఒత్తిడితో వందకు పైగా కవితలను ‘జ్వలిత గీతాల సంచలనం’ పేరుతొ పుస్తకంగా తెచ్చారు. ఇదొక్కటే ఆయన ముద్రిత గ్రంథం. కథలు, నవలలు పుస్తకాలుగా రావలసి ఉంది.
ఐదు దశాబ్దాలకు పైగా రచనారంగంలో ఉన్న సిహెచ్. మధు తన జీవితకాలమంతా కార్మికులు, కర్షకుల వైపునే నిలబడ్డారు. ఉద్యమాల వెంటనే నడిచారు. ఆ ప్రయాణంలో అరెస్టులు, పోలీసు కేసులు ఎదురైనా భయపడలేదు. ఆయన కలం పీడిత వర్గాల గురించే అక్షరాలు సంధించింది. ఆయన తనను తాను ‘శ్రమైక జీవనపు సౌందర్యపు జనం మధ్య/చెమట చుక్కను మాత్రమె’ అని నిర్వచించుకున్నారు. ప్రజాకవి కాళోజీ బాటలో నడిచిన మధు- ‘నా కలం కాళోజీ గళం/సాహితీ నేలను దున్నే హలం’ అని తన సైద్ధాంతిక మార్గం ప్రకటించుకున్నారు. ఆయన ఏ రచన చదివినా, ఆయనను దగ్గరగా చూసినా ఏ మిత్రునికైనా అందులోని సత్యం బోధపడుతుంది. ప్రజాకవి కాళోజీ లాగా సిహెచ్.మధు జీవితం, సాహిత్యం వేర్వేరు కాదు. రెండూ ఒక్కటే అని తెలుస్తుంది.