‘తిరునగరి కవితలు తేజస్వంతములు, ఓజస్వంతములు’ అన్నాడు దాశరథి. ‘పద్యం, గేయం, వచనం వంటి కవితా ప్రక్రియలలో తిరునగరిది అందెవేసిన చెయ్యి. ఆయన రచనలు సమాజాన్ని విశ్లేషించే ఎక్స్ రేలు’ అన్నాడు సినారె.
  
 ఐదు దశాబ్దాల నుంచి నిరంతర సాహిత్య సృజన చేస్తున్న పద్యకవి, వచనకవితా కవి, కవిత్వ విమర్శకుడు తిరునగరిగారు. అపారమైన ధారణాశక్తి కలిగిన పండితుడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో మంచి అభినివేశం ఉన్నవారు. ప్రాచ్య, పాశ్చాత్య కవిత్వ సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న సాహితీవేత్త. కవిత్వమే శ్వాసగా జీవించే కవిత్వోపాసకులలో ఒకరు తిరునగరిగారు. కవిత్వరచన, విమర్శనం, వ్యాఖ్యానాలే కాకుండా అద్భుతమైన వక్తవ్యం వారి ప్రత్యేకత. అసాధారణ ధారణాశక్తితో ఎందరో రచనలను ఉదాహరిస్తూ, ఆశువుగా పద్యాలు చెప్తూ తాను చేసే సాహిత్యోపాన్యాసాలు చేయడంలో తనకు తానే సాటి.
    
ముప్పైకి మించి సాహితీరచనలు చేసాడు. సాహిత్యవ్యాసాలు వెయ్యికి ఎక్కువే వుంటాయి. గొప్ప గేయ రచయిత కూడా. తిరునగరిగారు వందలాది లలిత, దేశభక్తి, ప్రబోధాత్మక గేయాలు రచించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఎన్నో పాటలు ప్రసారమయ్యాయి. వందలకొద్ది సాహిత్యసదస్సులలో, కవిసమ్మేళనాలలో ప్రధానవక్తగా తిరునగరిగారు పాల్గొన్నారు. అనితరసాధ్యమైన ప్రసంగాలు చేసారు.
    
మానవత్వం తన కవిత్వ వస్తువు. మానవసంవేదనలను కవిత్వీకరించటంలో అందెవేసిన చెయ్యి తిరునగరిగారు. సహజ, సరళ శైలిలో రాయడం తన ప్రత్యేకత.
    
ఉషోగీతి అనే కవితలో
    ‘మనసూ మనసూ కలిస్తే స్నేహం
    మనిషీ మనిషి కలిస్తే దేశం’ అంటారు తిరునగరి

ఒకచోట పద్యంలో ‘పొలము దున్నువాడు పూజ్యుడు జాతికి’ అని మానవాళికి తిండిపెట్టే రైతన్నను కీర్తిస్తారు.
    ‘తిమిరంతో దీపం వెలిగించేవాడు
    నైరాశ్యంలో ఆశాగీతం వినిపించేవాడు
    సాటిమనిషికి సాయం చేసేవాడు
    విశ్వకళ్యాణ పద్యం విరచించేవాడు...కవి’
        కవిని గురించి తిరునగరిగారి నిర్వచనం.
    ‘ఓ ఆశయపథంలో సాగిపోతున్నప్పుడు 
    కష్టాలు తప్పవు
    లక్ష్యసాధనలో కృషి చేస్తున్నప్పుడు
    బాధలు తప్పవు
    స్వప్నసాఫల్యం కోసం శ్రమిస్తున్నప్పుడు
    అవాంతరాలు మామూలే’ అని తన బోధ.

నిరంతరం ప్రవహించే నిష్కామకవి తిరునగరి అని ఎన్.గోపి, హృద్య పద్య,  కవితారచనతో సహృదయుల్ని మెప్పించే మధురకవి తిరునగరి అని ఉత్పల తనను అభినందించారు.
    
తిరునగరిగారు ‘కొవ్వొత్తి, వసంతంకోసం, అక్షరధార, గుండెలోంచి, ముక్తకాలు, మాపల్లె, మనిషికోసం, వానా-వాడూ, ఈభూమి, నీరాజనం, ప్రవాహిని, ఉషోగీత, జీవధార, ఒకింత మానవత కోసం, యాత్ర, కొత్తలోకం వైపు, కిటికీలోంచి, సముద్రమథనం’ ఇప్పటివరకు అచ్చయిన తన కవితాసంపుటులు. బాలవీర(శతకపద్యాలు),

శృంగారనాయికలు(ఖండకావ్యం), తిరునగరీయం(చతుశ్శతి-4 పద్యసంపుటాలు) పద్యరచనలు. హిందీ, ఇంగ్లీష్ కవితలనెన్నింటినో అనువదించి తెలుగులోనికి తెచ్చారు. జనహిత, చెమట నా కవిత్వం(వచన కవితా సంపుటులు), తిరునగరీయం(5వ పద్యసంపుటి) త్వరలో అచ్చులో రానున్నాయి.
    
తిరునగరిగారు యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని బేగంపేట గ్రామంలో శ్రీమతి జానకిరామక్క, శ్రీ మనోహర్ దంపతులకు 1945 సెప్టెంబర్ 24న జన్మించారు. ఉద్యోగ జీవితకాలంలో యాదాద్రి జిల్లా ఆలేరులో నివాసమేర్పరచుకున్నారు. ప్రస్తుతం చింతల్(హెఛ్ ఎం టి)లోని గణేశ్ నగర్ లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.తిరునగరి జీవితం-సాహిత్యం అనే అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖవారు పరిశోధనలు(పిహెచ్ డిలు) చేసారు.
    
మూడు దశాబ్దాలపాటు తెలుగు భాషోపాధ్యాయుడుగా, తెలుగు లెక్చరర్ గా పనిచేసిన తిరునగరిగారికి వేలాదిమంది శిష్యులు. ప్రత్యక్షంగా పాఠశాలలో, కళాశాలల్లో తన పాఠాలు విన్నవారు. పరోక్షంగా అభిమానించేవారు ఎందరో. తెలుగు పాఠాలతో పాటు తన విద్యార్థుల జీవితాలకు గైడెన్స్ చేసే మంచిటీచర్. పాతికకు పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర పురస్కారాలందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యిచ్చే దాశరథి పురస్కారం-2020 ఈ సం.  తిరునగరిగారికి ప్రకటించడం అభినందనీయం.

-శ్రీ రామోజు హరగోపాల్