తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. రమేష్ కార్తిక్ నాయక్ రాసిన ఈ కవిత చదవండి.
రుతువుల రంగుల్లో
కలలు కన్న గొంగళి పురుగులు
దుఃఖించినప్పుడల్లా
చరిత్ర దాచిన ఎన్నో చీకటి హత్యలు
గ్రహ శకలాలపై పడి
జరిగిన, జరుగుతున్న దేశ అస్తిత్వాల గురించి అన్వేషణ మొదలు పెడతాయి.
మనిషి మాంసాన్ని పరుచుకున్న భూమి.
కొంచం కొంచంగా స్వాతంత్ర సందిగ్ధతను పాడుతుంది .
భూమిలో సగంజీవంతో నిరీక్షిస్తున్న ఎముకలు
దేశానికి స్వాతంత్రమెప్పుడో అని మధనపడిపోతుంటాయి
పాపం వాటికేం తెలుసు
వాటిని మేలుకొలిపే సీతకోకచిలుకలు
స్వాతంత్రం వచ్చినప్పుడే పోరాట యోధుల వెంటే వలసపోయాయని
చూడాలి ఇప్పుడు ఎవరు పాడతారో ? స్వాతంత్ర గీతాన్ని, ఆ గీతంలోని చరిత్రను