"సినారె సాహిత్య కళాపీఠం" వారి రాష్ట్రస్థాయి పురస్కారం ఈ యేడు కవి, విమర్శకులు గురిజాల రామశేషయ్యను వరించింది.
జ్ఞానపీఠ్ అవార్డు స్వీకర్త డాక్టర్ సి. నారాయణ రెడ్డి విశ్వంభర కావ్యానికి వ్యాఖ్యానం రచించిన కవి, విమర్శకులు గురిజాల రామశేషయ్యను "సినారె సాహిత్య కళాపీఠం" వారి రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంస్థ వ్యవస్థాపకులు మల్లెకేడి రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 30 ఆదివారం రోజున జడ్చర్లలో జరిగే సభలో "సినారె సాహిత్య కళాపీఠం" వారి రాష్ట్రస్థాయి పురస్కారం అందుకోనున్నారని సినారె సాహిత్య కళాపీఠం సంస్థ వ్యవస్థాపకులు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డాక్టర్ పోరెడ్డి రంగయ్య తెలియజేశారు. రామశేషయ్య మిర్యాలగూడలో తెలుగు అధ్యాపకులుగా సుమారు 12 సంవత్సరాలు ఉద్యోగం చేశారు.
అమ్మంగి వేణుగోపాల్ కవిత : వాతావరణ సూచన !
వీరి "విశ్వంభర - అనుశీలన" యూనివర్సిటీలలో పాఠ్యాంశంగా ప్రసిద్ధి పొందింది. అక్షర పతాక , ఆనందాశ్రువులు, వికాసరేఖలు వంటి గ్రంథాలు, మరెన్నో సాహిత్య వ్యాసాలు ప్రచురించారు. రామశేషయ్య ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ సాహిత్యం గురించి ఉపన్యాసాలు చేసారు. మిర్యాలగూడలో "సాహితీ లహరి" సంస్థస్థాపకుల్లో వీరు ముఖ్యులు.
నల్లగొండ జిల్లాలో సాహిత్య చైతన్యం కోసం కృషి చేసిన రామశేషయ్యకు పురస్కారం లభించటం ఆనందదాయకమని తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు తడ్కమళ్ల రాంచందర్ రావు, పలు సాహిత్య సంస్థలు తమ హర్షం ప్రకటించాయి.