మణిపూర్ రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ ఒక అమానుషమైన చర్య అని కవిసమ్మేళనంలో పాల్గొన్న వక్తలన్నారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం ఈ దారుణ ఘటనను ఖండించింది.
అనంతపురం: మణిపూర్ రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ ఒక అమానుషమైన చర్య అని కవిసమ్మేళనంలో పాల్గొన్న వక్తలన్నారు. "మణిపూర్ హింస ప్రతిఘటన కలాలు" పేరుతో జిల్లా రచయితల సంఘం (జిరసం) స్థానిక ఆర్ట్స్ కాలేజీలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వైఎస్ఆర్ లైవ్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సురేష్ అధ్యక్షత వహించిన ఈసభకు ఆత్మీయ అతిథులుగా మానవత రక్తదాతల సంస్థ అధినేత తరిమెల అమరనాథ రెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి , జిరసం గౌరవ సలహాదారు కంబదూరు షేక్ నబి రసూల్, సీనియర్ కవి జెట్టి జయరాం, గోవిందరాజులు తదితరులు హాజరై ప్రసంగించారు.
డాక్టర్ శాంతి నారాయణ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జరిగిన దుర్మార్గ ఘటనపై సత్వరమే స్పందించి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ముదావహమని జిరసం సభ్యులను అభినందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు సంభవించిన యువకులు సత్వరమే స్పందిస్తూ సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యతను తీసుకోవాలని అన్నారు.
ఐద్వా నాయకురాలు సావిత్రి మాట్లాడుతూ స్త్రీల ఓట్ల కోసం నానా పాట్లు పడే ప్రభుత్వాలు వారి మానాన్ని కాపాడలేకపోతున్నాయని, దేశంలో రక్షణ వ్యవస్థ వైఫల్యానికి మణిపూర్ సంఘటన అద్దం పడుతుందని అన్నారు. తర్వాత కవులు చాలా విలువైన కవితలతో మణిపూర్ మారణకాండని నిరసించారు. ఈ కవితలపై యాములపల్లి నర్సిరెడ్డి చక్కని సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జిరసం కోశాధికారి కోటిగారి వన్నప్ప, పోతుల రాధాకృష్ణ, డాక్టర్ ఎం ప్రగతి, దాసన్న గారి కృష్ణమూర్తి, డాక్టర్ బృంద, జూటూరు షరీఫ్, రియాజుద్దీన్,ఆర్ట్స్ కాలేజ్ ఫిలాసఫీ లెక్చరర్ రమేష్, అడవాళ శేషగిరి రాయుడు, మధుర శ్రీ, దోరణాల విదురారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామచంద్రనాయక్, చెట్ల ఈరన్న, ఒంటెద్దు రామలింగారెడ్డి, వలస రమేష్, హర్షిత గణేష్, వంశీ, ఏసుదాస్, మల్లినాద్ తదితరులు పాల్గొన్నారు.