చైతన్య స్ఫూర్తి కెరటాలు ఈ రాలిన చుక్కలు

By telugu team  |  First Published Feb 13, 2020, 2:48 PM IST

శ్రీనిధి రాసిన రాలిన చుక్కలు కవితాసంపుటిపై వినాయం ప్రకాశ్ రివ్యూ రాశారు. ఆమె కవిత్వంలోని మృదుత్వాన్ని, స్త్రీ పక్షపాత వైఖరిని ఆయన వివరించారు. శ్రీనిధి గారి *రాలిన చుక్కలు* పుస్తకం  ఒక ఆదర్శవంతమైన కవితల సమాహారం అని ఆయన అన్నారు.


కవిత్వం అంటే ఒకప్పుడు స్త్రీని వర్ణించడం కోసం, ప్రేమను వ్యక్తపరిచేందుకు ,ఊహా లోకంలో విహరించే మాటల కోటల బ్రమల్లో ఉండేది కానీ నేడు నిజాన్ని నిర్భయంగా, అన్యాయాన్ని నిగ్గదీసి అడిగే గొంతుకగా,సమాజాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడే అద్భుతమైన ఆయుధంగా కవిత్వం నిలుస్తోంది ..ఇలా సామాజిక చైతన్యం కోసం అహర్నిశలు తపిస్తూ అక్షరాల నదీ ప్రవాహాన్ని ఆవిర్భవిస్తూ రేపటి కలల భారతావని భవిష్యత్తుకు అక్షరాల పునాదిని వేస్తూ తన ప్రత్యేకమైన రాలిన చుక్కల అక్షర హారాన్ని భరతమాత మెడలో వేసింది  నేటి మేటి కవయిత్రి *విప్లవ శ్రీనిధి*

శ్రీనిధి గారి *రాలిన చుక్కలు* పుస్తకం  ఒక ఆదర్శవంతమైన కవితల సమాహారం  అని చెప్పవచ్చు , కవయిత్రి వయస్సు చిన్నదైనా ఆలోచన పరిణితితో కూడినది..మూస ధోరణిలో కాకుండా ప్రతి కవితలో తాను లీనం అయిపోయి రాశారు ..సమాజములో జరిగే అన్యాయాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ అద్భుతముగా కవితలు ఆవిష్కరించిన ప్రతిభాశాలి విప్లవ శ్రీనిధి గారు .

Latest Videos

Also Read: చింతన -2: కవిత్వం -ప్రయోజనం

చిన్నవయస్సులోనే జీవితాన్ని అవపోసన పట్టి,అనేక కష్టాలు అనుభవించి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు, పాఠ్యపుస్తకాలు చదివి పరీక్షలు రాయవలసిన వయస్సులో సమాజాన్ని పూర్తిగా చదివేందుకు ప్రయత్నం చేస్తూ తనదైన శైలిలో మార్పు కోసం తపిస్తూ అక్షర యజ్ఞం చేస్తున్నారు కవయిత్రి.

కవితల ఎంపిక , శీర్షికలు చాలా బాగున్నాయి ,తెలంగాణ మాండలికం లో స్త్రీలపై జరుగుతున్న అరాచకాలు , సామాజిక రుగ్మతలపై వీరు రాసిన కవితలు ఆలోచింపజేశాయి.

అలతి అలతి పదాలతో పండితుడి నుంచి పామరుని దాకా అందరికి చదవగానే కవితల భావం అర్థము అయ్యేవిధంగా కవితలు రాశారు.

కవితలు పరిశీలించి చూస్తే ... *నా అంతరంగం* కవిత లో అక్షరాలు కవియిత్రి ని ఏవిధంగా అక్కున చేర్చుకుని తన వ్యక్తిత్వం నిర్మించిన తీరు వివరిస్తూనే *రాలిన చుక్కలు* కవిత లో అడగటానికి ఒక గొంతు అక్కరలేదు  కడగటానికి ఒక చేయి రావాలి అని ఒక విప్లవ శంఖంలా  ఒక స్ఫూర్తి వంతమైన కవితలు అందించారు.

నేటి సమాజంలో ఆడవారిపై అత్యాచారాలు చాలా ఎక్కువగా  జరుగుతున్నవి వీటికి కారణం బాధ్యతా రాహిత్యం , విచ్చలవిడి తనం వీటిపై కవయిత్రి  పోరాడుతూ తన  *డివిటీపట్టుకురండి*  కవిత ద్వారా మానవ మృగాళ్లకు వాళ్ళు చేస్తున్నది తప్పు అని వారికి సన్మార్గపు వెలుగు దారి  చూపిస్తుంది కవయిత్రి , చరమగీతం, వాడు మనిషట,ఆమె ఎక్కడ దాక్కుంది, బ్రతనివ్వండి జీవించనివ్వండి లాంటి కవితలు ఆలోచింపజేశాయి..

Also Read: "నీటిదీపం" కాదు కన్నీటి దీపం

"మృగాడి కోరిక తీరేందుకు చిరిగిన తన దేహాన్ని నన్ను నేను కుట్టుకుంటాను  "అంటూ పేద *వేశ్య* మనోవేదన ఆవిష్కరణ తీరు హృదయాన్ని ద్రవించింది.అత్యాచార బాధితురాలి మనోవేదనకు కళ్ళకు కట్టినట్లు చూపిన కవిత  *వాడికి సమర్పణమయ్యా* ఈ కవిత చదివితే ఎటువంటి కఠినాత్ములకైనా కన్నీరు ఆగదు. నేటి సమాజంలోని ఈ వికృత క్రీడను యదార్థముగా ఆవిష్కరించిన శ్రీనిది ధైర్యాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది.

 అమరవీరా అశ్రునివాలి లో  సైనికుల త్యాగాలకు సలాం చేసినా,ఆడపిల్ల శక్తి సామర్ధ్యాలను ఎలుగెత్తి చాటినా, కోటి సమస్యలు ఉన్నా కలం  కదిలించలేని నేనొక గొడ్రాలిని అని ఘాటుగా బాధ్యతను గుర్తు చేసినా  ఆ చొరవ దైర్యం అక్షరఛాతుర్యం విప్లవ శ్రీనిధి కే చెల్లింది .ఆ సామాజిక బాధ్యత ఉన్న వారే నిజమైన రచయితలు గా నిలుస్తారు.

దుర్మార్గపు  నీతిలేని కొన్ని సినిమాల తీరు కడుగుతూ.కార్మికుల త్యాగాలు గుర్తు చేస్తూ, ఎవరూ స్పృశించని కవితా వస్తువు అయిన పేపర్ బాయ్ ని తీసుకొని అతని  త్యాగానికి విలువ ఇస్తూ సాగిన రాలిన చుక్కల కవితా ప్రవాహం అద్భుతమైన అనుభూతి ,  నిరుద్యోగ సమస్యలు, వీధి బాలల కష్టాలపై తనదైన  శైలిలో కవితలు రాసి సెబాష్ అనిపించింది కవయిత్రి 

Also Read: సామాజిక చైతన్య స్ఫూర్తి "నాన్న పచ్చి అబద్దాలకోరు"

ఎన్నో అంశాలపై కవితలు అల్లిన తీరు నిజంగా ఆదర్శవంతం. కవితల ఎత్తుగడ , ముగింపు చాలా బాగుంది విప్లవ శ్రీనిధి వయస్సు   గురించి ఆలోచించకుండా ప్రతిభను గుర్తించి చూస్తే శ్రీనిధి శ్రీశ్రీ,కాళోజీ, గురాజడ, తిలక్ గారి సరసన నిలవగలదు అని నేను  ఖచ్చితంగా చెప్పగలను ఆ కవితావేశం శ్రీనిధిలో పుష్కలంగా ఉంది.

ఇంత మంచి పుస్తకం రాసిన విప్లవ శ్రీనిధి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. భవిష్యత్తులో మరెన్నో మంచి పుస్తకాలు రాసి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆసిస్తూ మరోమారు శుభాకాంక్షలు.

- వినాయకం ప్రకాష్

click me!