అనేక పార్శ్వాలు చేరిన రెండు ముఖ విలువల మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకటి కళ కళ కోసం లాగా కవిత్వం కవితా ప్రయోజనాలకోసం అనేది. రెండవది కవిత్వం ప్రజలకోసం అనేది.
కవిత్వానికి సంబంధించి ప్రయోజనమనే చర్చ ఒకటి ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. నిజానికి ప్రయోజనం నిర్దిష్టంగా నిబద్ధంగా ఎప్పుడూ లేదు.సామాజిక విలువలకు కట్టుబడి అది మారుతూ వస్తుంది. అదీ పరిణామశీలమే.వ్యక్తిగతమైన అభిప్రాయాల మేరకు ప్రయోజనంవిషయంలో ఒక సాధారణ చర్చ,లేదా ఒక కుదుపు రావొచ్చు కాని అది పూర్తి ప్రయోజనం గా నిలబడాలంటే దానికి కేవలం ఉబలాటమో, ఉద్వేగమో సరిపోదు. చైతన్యం కావాలి. ఈ చైతన్యం జీవితాన్ని ఆనుకుని,దాని గతిని అనుకుని నడుస్తుంది.తొలిదశలో తవ్వుకోవడానికో వేటాడడానికో ఒక రాతి పనిముట్టును తయారుచేసిన మానవుడే,తరువాతి కాలంలో ఆకాశంలోకెగిసేందుకు విమానాలను తయారుచేశాడు.మొదట చేసిన పని నమ్మకమే రెండవదానికి మూల భూమిక,ఇంత శాస్త్రీయంగా మనం చేస్తున్న అన్ని పనుల వెనుక ప్రాయోగికంగా ఆదిమ జాతులు చేసిన కృషి ఉంది.ఆ కృషి వెనుక ప్రయోజన ముంది.-"ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే"-(ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా పని చేయడు)అని ప్రాచీనులు. అలాంటిది కవిత్వానికి ఏ ప్రయోజనం లేకుండా కావ్య రచన ఉంటుందా.అయితే ఈ ప్రయోజనం ఒక్కటిగా ఏ కాలానికీ ఉండదు.ప్రజాప్రయోజనాలు కూడా కాలాన్ని బట్టి మారుతాయి.మారాయి కూడా.అందువల్ల ప్రయోజనం అనేది కాలం నిర్ణయిస్తుంది.అందువల్లే కవితా వస్తువులు కూడా ఆయా ప్రయోజనాల కోసం మారుతాయి.పరికరాలతో సహా.మరో విషయం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది కేవలం మారిన ప్రయోజనమే వ్యవహారంలో ఉండదు.గతపు విలువలను కలుపుకొని ఉంటుంది.కాకపోతే ఒక ప్రధాన సందర్భంలో ఎక్కువగా సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. ప్రయోజనమనే అంశం వెలుగులోకొచ్చేవరకే తప్ప దానికి ముగింపు లేదు. బహుశః ఇందువల్లే అనేక పార్శ్వాలు చేరిన రెండు ముఖ విలువల మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకటి కళ కళ కోసం లాగా కవిత్వం కవితా ప్రయోజనాలకోసం అనేది. రెండవది కవిత్వం ప్రజలకోసం అనేది. అనేక సంఘర్షణలున్నా ఈ రెంటిలో ఎదో ఒకదానికివైపుకు అవన్నీ ఒదిగిపోతాయి. మొత్తంగా ప్రయోజన రహితమైనదాన్ని మాత్రం ఎవరూ అంగీకరించడం లేదు.
వేదకాలంనుంచే సాహిత్యం ఉన్నా రామాయణాన్నుంచి సాహిత్యచరిత్రలు మొదలవుతాయి.ఇతిహాసాలన్నీ ధర్మ,అర్థ,కామమోక్షాలనే పురుషార్థాలను చెప్పేవి. వాటి ప్రయోజనం అంతే."ఇతిహ ఉపదేశ పరంపరా ఆస్తే అస్మిన్"(ఇది ఇలా అనే ఉపదేశపరంపర ఎందులోఉందో అది)
కావ్యప్రకాశకారుడు చెప్పిన కావ్యప్రయోజనాలు ఇలాంటివిగానే కనిపిస్తాయి.-"కావ్యం యశసే,అర్థకృతే వ్యవహారవిదే,శివేతరక్షతయే/సద్యః ప్ర నిర్వృతయేకాంతాసమ్మితయోపయుజే"-(కావ్యం కీర్తికొరకు,అర్హము కొరకు,ప్రవర్తనావిధిని తెలువడంకొరకు,మంచి కానిది నశించడం కోసం,వెంటనే ఆనందాన్నివ్వడం కోసం,కాంతమాటలవలె ఆసక్తి గొలపడంకోసం)ఇన్ని చెప్పాడంటేనే చాలా చరచ జరిగిందని అర్థం. సుమారుగా ప్రాచీన సాహిత్యంలో ప్రయోజన చర్చ అంతా ఇలాంటి విషయాలనానుకొనే ఉంది. కేవల ధర్మాచరణ గురించి మాత్రమే మాట్లాడలేదు.యశసే,అర్థకృతే రెండు కవి వ్యక్తిగత ప్రయోజనాలు.వ్యవహార విదే,శివేతరక్షతయే అనేవి సామాజికాలు. స్త్రీమాటల్లా ఆసక్తినిచ్చేవి అనడం రస నిష్టకు సంబంధించింది. సద్యః పరనిర్వృతయే కూడా అలాంటిదే.బహుశః ఇందులోని ధర్మ ధారుడ్యం వల్ల ధర్మశాస్త్రాలకు వీటికి భేదంలేదనే దృష్టితో నాటకాలు ప్రారంభమయ్యాయి.మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా -"కావ్యేషు నాటకం రమ్యం(కావ్యాలలో నాటకం అందమైనది),నాటకాంతం హి సాహిత్యం(నాటకాన్నుంచి మిగిలిందే సాహిత్యం)లాంటి వాక్యాలను కాదనలేం. కావ్యాలనుండి వచన కవిత దాకా నాటకంలోని ప్రకటనా పద్ధతుల ప్రభావాన్ని గురించి చాలా చర్చించుకోవాలి అది ప్రయోజన చర్చలోకి రాదు.
"న ఇతివృత్త వర్ణనాదేవ కవేః ఆత్మ పద లాభః"-(కేవల ఇతివృత్త వర్ణనలవల్లంబే కవి ఆత్మసంతృప్తిచెందదు)ఈ పనులను ఇతిహాసాలు కూడా చేశాయి.అందువల్ల రసనిష్టగల వాక్యం కావాలి.దీనికోసం నాటకాన్ని ఆశ్రయించక తప్పలేదు.ఈ రసనిష్టగల వాక్యమే అభివ్యక్తి,ప్రకటన గా మనం ఈ కాలానికి వాడుతున్నాం. సంస్కృతభారతం నాటికి "వ్యవహారవిదే,శివేతర క్షితే"అనేవే సామాజిక ప్రయోజనాలు.ఈ వ్యవహారమే ధర్మం.మనిషి మనిషిపట్ల ఎలా ప్రవర్తించాలనేదే ధర్మం చెప్పింది.కాలక్రమంలో ఈ ధర్మమూ అదుపుతప్పింది.ఒకటి అరా ఉదాహరణలు చూస్తే ఇది కొంత అర్థమవుతుంది.
Also Read: చింతన 1: రూపమూ ప్రక్రియా- కవిత్వం
నైవ రాజ్యం నరాజాసి న దండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వా రక్షంతి చ పరస్పరమ్(వ్యాస భారతం,యుద్ధపర్వం)-(పూర్వం రాజ్యాలూ లేవు,రాజులూ లేరు దండించేవాడూ దండించబడేవాడూ లేడూ.ధర్మాన్ని అనుసరించి ప్రజలు ఒకరినొకరు రక్షించేవారు)ఈ ధర్మమే తొలిదశలోని కావ్యాల ప్రయోజనం.
"కోపంబులేమి సత్యా/లాపము నిజదార పర విలాసము శుచితా/గోపనమద్రోహంబవ/నీ పాలక !సర్వ వర్ణ నియతగుణంబుల్"-(శాంతి పర్వం.ప.221.ఆ.2)
(ఓ రాజా !కోపం లేకపోవటం,సత్యాన్ని మాట్లాడడం,గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం,శుద్ధత,రహస్యాలు లేకుండా ఉండడం,ద్రోహ చింతన లేకుండా ఉండడం అన్నివర్ణాలకూ నియత గుణాలు) భాగ వతం కూడా -"త్రింశల్లక్షణ గుణంబులు గలుగవలయు"- (సప్తమస్కంధం.ప.409)అని ఈ గుణాలను ముప్పైదాకా చెప్పింది. పుట్టుకకు సంబంధించిన చర్చ ఆకాలపు ధర్మశాస్త్రాలకు లేదు (తరువాతికాలాల వాటికి చేరిందన్నది తెలిసిందే). భాగవతం-"జాతి మాత్రంబున బురుషునికి వర్ణంబు నిర్దేశించబనిలేదు/ శమదమాది లక్షణ వ్యవహారంబుల గలుగవలయునని"-(సప్తమ,ప.419)-(శాంత ప్రకోపాలనుండేగాని పుట్టుకననుసరించి పురుషునికి వర్ణాన్ని నిర్దేశింపకూడదు)ఇదంతా ధర్మ మతం.బౌద్ధ జైన సాహిత్యాలూ ఈ ధర్మాన్ని మరింత దీప్తివంతం చేశాయి.నిజానికి ఈ ధర్మమతంలోని ఉన్నతవిలువలు ఆయాకాలాల సామాజిక రాజకీయ కారణాలవల్ల అదుపుతప్పాయి.అందువల్ల ప్రయోజనాలూ మారాయి.బౌద్ధం అందరినీ విద్యావంతులను చేయడానికి విద్యాలయాలను స్థాపించింది.అయితే తెలుగుభారతకాలం నాటికి పునరుద్ధరింపబడిన హిందూమత ఉద్ధరణ. ఆయా వాజ్ఞ్మయాలను నాశనం చేసింది. సుస్థిర ప్రభుత్వం లేకపోవడం. అన్ని చిన్న చిన్న రాజ్యాలలో యుద్ధాలుండడం కూడా ఒక అస్థిరకాలమే. అందుకే భారత రచన సుమారు మూడువందలపైచిలుకుకాలాన్ని నడచింది. వేదకాలంలోని ధర్మమతంలోని విలువలు, వర్ణవ్యవస్థ, స్త్రీలహక్కులు ఇవన్నీ రూపుమారాయి. పైగా కాలం చెల్లిన ధర్మాలుగా చెలామణిలోకి వచ్చాయి. నన్నయకాలంలో ఈ సామాజిక రాజకీయ నిర్బంధం ఎక్కువగా కనిపిస్తుంది.
సంస్కృత భారతంలో అన్నివర్ణాలకూ సమాన భాగస్వామ్యం సమాజంలో ఉంది. పాలన దాకా కూడా. యుధిష్టిరుని యౌవరాజ్యాభిషేక సమయంలో-"ధృతి స్థైర్యసహిష్ణుత్వాదానృశం స్యాత్తధార్జవాత్ భృత్యానామనుకంపార్థం"-(ధైర్యం స్థిరత్వం, సహనం, దయవలన, శక్తివలన సేవకులపట్ల స్పందించే గుణంవలన)ధర్మరాజుకు పట్టాభిషేకాన్ని నిర్ణయించాడు. కాని నన్నయ భారతంలో "ధృతరాష్ట్రుడు యుధిష్టిరుని రాజ్యభార దురంధరునిగానెరిఁగి భీష్మవిదురులతో నాలోచించి యౌవరాజ్యాభిషిక్తునింజేసిన-"-అని ముగించాడు. పౌరులు సేవకుల విషయాన్నిమరచాడు నన్నయ. ఇది నన్నయ పనిమాత్రమేకాదు. ఆనాటి రాజకీయ సామాజిక ప్రయోజనాలే కారణం. ఇలాంటివి తెలుగు సంస్కృతభారతాల మధ్య చాలా ఉన్నాయి.(నన్నయ కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులు;ఖందవల్లి లక్ష్మీరంజనం వ్యాసాలు చదివితే ఈ విషయం మరింత అర్థమవుతుంది)
కాని పోతన మాత్రం నిస్సంకోచంగా ధర్మం ఏది చెప్పిందో అది రాసాడు.నన్నయ భారతంలో కనుపించే కేవల బ్రాహ్మణ క్షత్రీయకులాలు కాకుండా అన్ని వర్ణాలూ పోతనలో కనిపిస్తాయి.సోమన కాలానికి బసవపురాణంలో మళ్ళీ అన్నివర్ణాలనూ సమానం చేసే ప్రయత్నం సాగింది. అందువల్ల ప్రయోజనం సామాజిక చైతన్యం,రాజకీయ సామాజిక పరిస్థితులు వీటిని బట్టి మారుతుంది ప్రయోజనమూ ఇందుకు వేరుకాదు.
స్వాతంత్ర్యానికి ఈవల జాతీయోద్యమ కవిత్వం రావడానికి, తరువాత ఎమర్జెన్సీ కాలంలో ఆయా కవిత్వాలు రావడానికి ఆయా ప్రయోజనాలకు కవులు కట్టుబడి ఉండడానికి సామాజిక మార్పులే కారణం. బహుశః ఈ కారణాల వల్లే కవిత్వానికి మార్క్స్ ఒక తప్పనిసరి అవసరమయ్యాడు. ఈ స్ఫూర్తిని నింపిన విప్లవ కవిత్వానికి అది ఇచ్చిన ప్రయోజనానికి సామాజిక మార్పులే కారణం.
ఆగని అణగారిణ వర్గాలపై దమనకాండ,పట్టనితనం పడగ విప్పుతున్న వర్ణవ్యవస్థ విషవలయం దళిత సాహిత్యానికి దోహదం చేసింది.ఇదీ సామాజిక మార్పులవల్లే కలిగింది. నిరుద్ధ భారతం నాటికి సాహిత్యానికుండే దళిత స్ఫృహకు, పదునెక్కున కవితనాటికుండే దళిత స్ఫృహకు మధ్య చైతన్యం బలంగా కనిపిస్తుంది. దానికీ సామాజిక రాజకీయ పరిస్థితులే కారణం. విశాలాంధ్ర ఏర్పడినప్పుడు ప్రశంసించిన తెలుగు కవుల గొంతుకకూ తొలి, మలిదశల ఉద్యమ కాలం నాటి గొంతుకకూ మధ్య తేడాలకు కూడా సామాజిక మార్పులే కారణం.
ఎప్పటిపరిస్థితులను అప్పుడు కవిత్వం, కవిత్వలోకం గమనిస్తుంది. ఆయా సామాజిక కట్టుబాట్లమేరకు నడుచుకుంటుంది. అయితే నూరు శాతం మార్పు ఏ సమూహంలోనూ సాధ్యం కాదు.ఇప్పటికీ భగవంతునిపేర శతకాలు వస్తాయి.రూపం చెరిగిపోనట్టే అది ఇచ్చిన భావజాలమూ చెరిగిపోదు.నిజానికి యుగాలు,సాహిత్యం ఆయాకాలాల రాజకీయ సామాజిక విధానాలు సాహిత్యంపై వాటి ప్రభావాలను విశ్లేషించుకుంటే ఈ ప్రయోజనాల్లోని మార్పులు వాటి కారణాలు అర్థమవుతాయి.
ఒక మార్పుకు ,ప్రయోజనానికి అనుకూలంగా ఉండలేనివాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు.ఆదర్శాన్ని చంపుకోలేక మంది నడిస్తారు.కనీసం నటిస్తారు.కొందరు ఆ ప్రయోజనాల ఆవశ్యకతను గమనించి నడుస్తారు.మార్పులు ప్రయోజనాన్ని బలపరిచేవి కానప్పుడు సంఘర్షణలూ వస్తాయి.వీటివల్ల సాహిత్యంలో,కవిత్వంలో చెత్త పేరుకుంటుంది గాని,ఏ ఉపయోగమూ ఉండదు. అందువల్ల కావ్యప్రయోజనంవ్యక్తిచైతన్యంపై ,వ్యక్తిచైతన్యం సామాజిక గతిపైన,సామాజిక గతి అది నడుస్తున్న సామాజిక రాజకీయవ్యవస్థలవలన నిలబడుతాయి.ప్రయోజనాన్ని నిలబెట్టే వరకే మనిషిపని ఆతరువాత దానికి అతనితో సంబంధంలేదు.దాని అవసరం ఉన్నంతవరకు లోకమే దాన్ని కొనసాగిస్తుంది.
- నారాయణ శర్మ