
రుతుస్రావానికి మూడు రోజుల ముందునుంచే అలసట, నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొనే వారు చాలా మందే ఉన్నారు. రుతుస్రావం నొప్పి, రక్తస్రావం భిన్నంగా ఉంటాయి. రుతుస్రావం అయిన మూడు నుంచి నాలుగు రోజుల వరకు నొప్పి రావడం సాధారణం. కానీ కొంతమంది మహిళల్లో రుతుస్రావం (Menstruation) ప్రారంభం కావడానికి ఒకటి లేదా రెండు వారాల ముందు లక్షణాలు కనిపిస్తాయి. దీనినే వైద్య శాస్త్రంలో పిఎంసి (PMS) అని అంటారు. అనగాPremenstrual syndrome అని అర్థం. ఈ సమయంలో కొంతమంది మహిళలలో లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆఫీసుకు వెళ్లడం, ఇంటి పనులు చేయడం, స్కూలుకు వెళ్లడం వంటి తమ రోజువారీ కార్యకలాపాలను చేయడం కూడా వారికి కష్టంగా ఉంటుంది. ఈ Premenstrual syndrome మహిళ రుతుస్రావం అయ్యే వరకు మాత్రమే ఉంటుంది.
ప్రీ-మెనుస్ట్రువల్ సిండ్రోమ్.. కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పిని కలిగించడమే కాకుండా, శారీరక మరియు మానసిక ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల మార్పుల వల్ల ఇది జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పిఎంఎస్ యొక్క లక్షణాలు :
మొటిమలు: అండోత్సర్గము సమయంలో మహిళల్లో గర్భధారణ జరగకపోతే శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. టెస్టోస్టెరాన్ కొద్దిగా పెరుగుతుంది. దీంతో ముఖంపై మొటిమలు వస్తాయి. ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరిగేకొద్దీ మొటిమలు వాటంతట అవే మాయమవుతాయి.
రొమ్ములో నొప్పి: అండోత్సర్గము సమయంలో శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా సస్తని గ్రంథులు (Mammalian glands) పెద్దగా అవుతాయి. ఈ కారణంగానే చాలా మంది మహిళలు తమ బహిష్టుకు ముందు లేదా సమయంలో రొమ్ముల్లో నొప్పి, వాపు సమస్యను ఎదుర్కొంటారు.
మానసిక స్థితి: రుతుక్రమం తర్వాత కొన్ని రోజుల వరకు మహిళల్లో PMS మానసిక అలజడిని కలిగిస్తుంది. ఈ సమయంలో ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. కొంతమంది స్త్రీలు రుతుక్రమానికి ఒక వారం ముందు డిప్రెషన్, ఆందోళనను సమస్య బారిన పడతారు.
ఆహారం పట్ల ప్రత్యేక ఆకర్షణ: సెరోటోనిన్ స్థాయిలు తగ్గితే మెదడులోని 'Feel good' రసాయనం బాగా తగ్గిపోతుంది. అప్పుడు చాక్లెట్, ఇతర చక్కెర వస్తువులను తినాలన్న కోరిక పెరుగుతుంది. మెగ్నీషియం, ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పుల కారణంగా చాక్లెట్ తినాలన్న కోరిక పెరుగుతుంది.
అలసట: రుతుస్రావానికి ముందు అలసిపోవడం సర్వ సాధారణం. అండోత్సర్గము నుంచి రుతుస్రావం వరకు శరీరంలో జరిగే అనేక ప్రక్రియల వల్ల అలసట కలుగుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది.
తలనొప్పి: రుతుస్రావానికి ముందు సెరోటోనిన్ స్థాయిలు (Serotonin levels) తగ్గుతాయి. ఇది రక్త స్థాయిలను పరిమితం చేస్తుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. చాలా మంది మహిళలు రుతుస్రావం కావడానికి ఒక వారం ముందు కూడా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు.
పేగు సమస్యలు: రుతుస్రావానికి ముందు శరీరంలో హార్మోన్ల మార్పులు చాలానే జరుగుతాయి. ఇది విరేచనాలు, వికారం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కొంతమంది మహిళల్లో ప్రేగు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమంది మహిళల్లో మలబద్ధకం ఉంటే మరికొందరిలో విరేచనాలు కలుగుతాయి.