
ఆడవారు కేవలం ఇంటిపనులకే పరిమైతయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. ఇళ్లు, ఆఫీస్ అంటూ ప్రతి పనిలో ముందుంటున్నారు. ఇంటిళ్లిపాదిని ఆరోగ్యంగా కాపాడేది ఇళ్లాలు మాత్రమే. అందుకే ఆమె ఆరోగ్యం బాగుండాలి. మగవారితో పోల్చితే ఆడవాళ్లే ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. కారణం వీళ్లు ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం. ముఖ్యంగా 30 నుంచి 40 ఏండ్ల వయసు నుంచే ఆడవారికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాయామం చేయండి..
ఇంటి పని, బయటపని కారణంగా ఆడవాళ్లు ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టరు. కానీ మీరు రోజంతా అలసిపోకుండా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే ఉదయాన్నే లేచి ముందుగా కొన్ని వర్కౌట్స్ ను చేయాలి. ఏరోబిక్స్, యోగా లేదా రన్నింగ్, జాగింగ్ వంటివి ఏదైనా చేయాలి. ఇవి మీ శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
భోజనాన్ని స్కిప్ చేయకూడదు
పనిలో పడి ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట తినని ఆడవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల మీ ఒంట్లో సత్తువ తగ్గుతుంది. దీనివల్ల ఏ పనీ చేతకాదు. ముఖ్యంగా ప్రోటీన్ల లోపంతో మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే టైంకు తినండి. అలాగే మీరు తినే భోజనంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రతిరోజూ ఆకు కూరలను తింటే మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సీజనల్ పండ్లు, కూరగాయలు
సీజనల్ పండ్లు, కూరగాయల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు పోషక లోపాలను పోగొడుతాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదం తప్పుతుంది. అందుకే ఆడవాళ్లు సమయం దొరికినప్పుడల్లా సీజనల్ పండ్లను తినాలి. ఇక మీ రోజు వారి ఆహారంలో సీజనల్ కూరగాయలను ఖచ్చితంగా చేర్చాలి.
మాంసాహారం
మాంసాహారం పోషకాల భాండాగారం. చేపలు, గుడ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన శరీరంలో పోషకాల లోపాల్ని పోగొడుతాయి. అందుకే వీటిని మోతాదులో తింటూ ఉండండి. ఒకవేళ మీరు వెజ్ మాత్రమే తింటే మీ ఆహారంలో సోయాబీన్, టోఫు వంటి ఆహారాలను చేర్చండి. వీటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా పోషకాలకు మంచి వనరు.
పాలను తాగండి
ఒక వయసు రాగానే చాలా మంది పాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు. కానీ పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. పాలను మానేయడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది. ఎముకల బలం ఉండదు. అందుకే పగటి పూట లేదా రాత్రి పడుకునే ముందు ఆడవారు పాలను ఖచ్చితంగా తాగాలి. దీంతో మీ ఎముకలు బలంగా ఉంటాయి.