మొటిమల మచ్చలను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి..

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 2:42 PM IST
Highlights

మొటిమలు కొన్ని రోజులకు తగ్గిపోయినా వాటివల్ల ఏర్పడ్డ మచ్చలు మాత్రం అంత సులువుగా తగ్గిపోవు. మొటిమలు పగిలిపోయినా.. వాటిని గిచ్చినా నల్ల మచ్చలు ఏర్పడతాయి. 
 

మొటిమల సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే మొటిమలు కొన్ని రోజులకు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ  మొటిమలను గిచ్చడం వల్ల ఏర్పడ్డ మచ్చలు మాత్రం అస్సలు పోవు. ఏండ్లు గడిచినా అలాగే ఉంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మొండి మచ్చలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పసుపు, శెనగ పిండి

మొటిమల మచ్చలను తగ్గించడానికి అర టీస్పూన్ పసుపులో ఒక టీస్పూన్ శెనగపిండి, టీస్పూన్ పాలు వేసి బాగా కలపండి. దీన్ని పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని కడిగేయండి. తరచుగా ఇలా చేస్తే మొటిమల మచ్చలు తొందరగా వదిలిపోతాయి. 

కీరదోసకాయ పేస్ట్ 

కీరదోసకాయ పేస్ట్ కూడా మచ్చలను తొలగిస్తుంది. దీనికోసం అరకప్పు కీరదోయ పేస్ట్ లో పావుకప్పు పెరుగును కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత చల్లని నీటితోనే కడిగేయండి. 

పసుపు, తేనె

అర టీస్పూన్ పసుపు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. 

ఓట్ మీల్, తేనె

పాలలో రెండు టీస్పూన్ల ఓట్ మీల్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. 

కలబంద జెల్

కలబంద మొటిమలను, మొటిమల వల్ల అయ్యే మచ్చలను తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం కలబంద జెల్ ను తీసుకుని మొటిమల మచ్చలన్నింటికీ అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయండి. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే మొటిమల మచ్చలు తొందరగా తొలగిపోతాయి.

గ్రీన్ టీ ఆకులు

పచ్చి గ్రీన్ టీ ఆకులు కూడా మొటిమల మచ్చలను పోగొడుతాయి. ఇందుకోసం కొన్ని పచ్చి గ్రీన్ టీ ఆకులను పేస్ట్ గా చేసి అందులో తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!