Bathukamma 2023: బతుకుమ్మ అంటే రంగురంగుల పువ్వులతో చేసే బొడ్డెమ్మగానే చూస్తాం. కానీ తీరొక్క పువ్వులతో చేసే బతుకమ్మ మనకు చేసే మేలు ఎంతో. బతుకమ్మలోని పువ్వుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి నీటిని శుద్ధి చేస్తాయి. అలాగే..
Bathukamma 2023: దేశంలో నవరాత్రి, దుర్గాదేవి పూజను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ పండుగలతో పాటుగా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రాష్ట్రాల్లో బతకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే బతుకమ్మ భూమి, నీరు, మనుషుల మధ్య సంబంధాన్ని ప్రతిబింబించే ప్రతీకగా చెప్పబడుతుంది.
తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మ ఆడపడుచులకు ఎంతో ఇష్టడైన పండుగ. పూలతో పేర్చేదే అయినా.. బతుకమ్మను ఎలా పడితే అలా పేర్చకూడదు. దీన్ని గోపురం ఆకారంలోనే పేరుస్తారు. అంటే బతుకమ్మను దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో కనిపించే గోపురంతో పోల్చొచ్చు. కాగా బతుకమ్మను మన జీవితానికి తల్లిగా కూడా భావిస్తారు. అందుకే ఆడవాల్లు కుటుంబం బాగుండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటారు.
ఈ తొమ్మిది రోజుల పండుగ పితృ అమావాస్య రోజున ప్రారంభమై ఆశ్వయుజ నవమి అంటే దుర్గాష్టమి నాడు... సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే? ఆచారాల పరంగా బతుకమ్మను బయోడిగ్రేడబుల్ పూలతోనే పేరుస్తారు.
మొదటి ఏడు రోజులు ఆడవారు మట్టితో పాటు చిన్న బతుకమ్మతో పాటుగా బోడెమ్మ అంటే గౌరీ దేవి ప్రతిమను కూడా తయారుచేస్తారు. అలాగే నువ్వులు, బియ్యం పిండి, తడి బియ్యం, బెల్లం మొదలైన వాటితో సహా ప్రతి రోజు సూచించిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.
చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆడవారు పెద్ద బతుకమ్మను తయారుచేస్తారు. అయితే సాంప్రదాయకంగా మహిళలు బతుకమ్మను తయారుచేయడానికి దాదాపుగా ఒకే రకమైన పువ్వులను ఉపయోగించినప్పటికీ.. ఏ రెండు బతుకమ్మలు ఒకేలా ఉండవు.
ఊరంతా బతుకమ్మను తయారుచేసి ఊరి మధ్యలో పెట్టి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడుతారు. డప్పు చప్పుల్లతో బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. పూలతో తయారు చేసే బతుకమ్మ వల్ల నీటికి ఎలాంటి హాని జరగదు.
ఈ పండుగకు కేవలం పువ్వులను మాత్రమే ఉపయోగిస్తాం. కానీ బతుకమ్మ తయారీకి భారతదేశంతో చాలా సంబంధం ఉందని, మొక్కల ఔషధ గుణాల గురించి పురాతన జ్ఞానం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయంగా స్థానికంగా పూచే పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు. గునుగుపువ్వు, తంగేడు పువ్వులు, గుమ్మడి పువ్వులు, వామ పువ్వుల, బంతిపూలు, చామంతిపువ్వులు మొదలైన పువ్వులను ఉపయోగిస్తారు.
జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ తయారీలో ఉపయోగించే పూలకు ప్రత్యేకమైన ఔషధ విలువలు ఉన్నాయని 'బతుకమ్మ' సంప్రదాయ, ఔషధ రహస్యాలు శీర్షికన కథనం ప్రచురితమైంది. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు నీటిని శుద్ధి చేసే గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందుకే బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు నీరు శుభ్రపడి పర్యావరణం మరింత మెరుగుపడుతుందని చెబుతున్నారు. బతుకమ్మను తయారుచేయడానికి ఉపయోగించే పువ్వులు, ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి.
గునుగు పువ్వు ఎన్నో ఔషధ లక్షణాలను కలిగి ఉందని చెబుతారు. అలాగే సాంప్రదాయకంగా దీన్ని విరేచనాలకు మందులలో, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా ఉపయోగిస్తారు. ఇక బంతిపూలు యాంటీసెప్టిక్ గా చాలాకాలంగా ప్రాచుర్యం పొందాయి.