ఆలస్యంగా నిద్ర..? ప్రాణానికే ముప్పు

By ramya neerukondaFirst Published Sep 18, 2018, 4:36 PM IST
Highlights

ఆలస్యంగా పడుకునే అలవాటు గల 4.33 లక్షల మందిని పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలస్యంగా పడుకునేవారిలో మధుమేహం, మానసిక సమస్యలే కాదు.. నాడీసంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

అర్థరాత్రి 12 గంటలు, ఒంటి గంట దాటితేగానీ నిద్రపోకపోవడం ప్రస్తుతకాలంలో ఫ్యాషన్ గా మారింది. మన పెద్దలు రాత్రి 8, 9గంటల కల్లా నిద్రపోయి.. ఉదయాన్నే 4 లేదా 5గంటలకు నిద్రలేచేవారు. అందుకే వారు వయసు మీదపడుతున్నా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం దీనికి విరుద్దంగా మారింది. తద్వారా ఆయుక్షీణం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందరాళే లేచేవారితో పోలిస్తే.. ఆలస్యంగా పడుకొనే వారికి ఆయుష్షు క్షీణించే ముప్పు 10% వరకు  ఎక్కువవుతున్నట్టు బయటపడింది. ఆలస్యంగా పడుకునే అలవాటు గల 4.33 లక్షల మందిని పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలస్యంగా పడుకునేవారిలో మధుమేహం, మానసిక సమస్యలే కాదు.. నాడీసంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నిద్ర వేళలు మారిపోవటం వల్ల జీవగడియారం దెబ్బతింటుంది. 

ఫలితంగా గ్లూకోజు జీవక్రియ, మూడ్‌ కూడా అస్తవ్యస్తమవుతాయి. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఒంట్లో వాపు ప్రక్రియ మొదలవుతుంది. పలు దీర్ఘకాల సమస్యలకు ఇదే మూలమని అధ్యయనాలు హెచ్చరిస్తుండటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోయేవారిలో ప్రవర్తన, అలవాట్లు కూడా మారిపోవచ్చు. 
ఉదాహరణకు- సమతులాహారం తీసుకోకపోవటం, జంక్‌ఫుడ్‌ తినటం వంటివి చేయొచ్చు. మద్యం, పొగ వంటి దురలవాట్లకూ బానిసలవ్వొచ్చు. ఇలాంటివన్నీ జీవనకాలం తగ్గిపోవటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. కాబట్టి రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం త్వరగా లేవటం అలవాటు చేసుకోవటం మంచిది. 

 సమయానికి నిద్రపోయేలా చూసుకోవచ్చు. మానసిక ఒత్తిడినీ  తగ్గించుకోవచ్చు.  రాత్రిపూట టీవీలు, మొబైల్‌ ఫోన్ల వంటి వాటికి అతిగా అతుక్కుపోకుండా చూసుకోవటం మేలు. అలాగే ఉదయం పూట పడకగదిలోకి వెలుతురు, ఎండ పడేలా చూసుకుంటే త్వరగా నిద్రలేవటానికి వీలుంటుంది.

click me!