RTC Strike: ప్రభుత్వం దిగివస్తేనే డ్రైవర్ బాబు అంత్యక్రియలు...లేదంటే: ఎంపీ సంజయ్

By Arun Kumar PFirst Published Oct 31, 2019, 11:39 PM IST
Highlights

గురువారం రోజంతా బాబు భౌతికకాయం వద్ద బైఠాయించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆర్టీసి జేఏసి టీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ ఆందోళనను ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాయి.  

కరీంనగర్: ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు ఆకస్మిక మృతికి నిరసనగా కరీంనగర్ లో ఇవాళ(గురువారం) బంద్ కొనసాగింది. అయితే ఈ బంద్ ను రేపు(శుక్రవారం) కూడా కొనసాగించనున్నట్లు బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఈ బంద్ కు కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

డ్రైవర్ బాబు మాదిరిగా మరో బలిదానం జరుగకుండా ఉండేందుకు ఓ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు స్థానిక ఎంపీ సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బోడిగు శోభ, ఎమ్మార్పిఎఫ్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలు తెలిపారు. ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారంకోసం చర్చలకు పిలిచేవరకు బాబు అంత్యక్రియలు జరపరాదని,ఇలాగే నిరసన తెలియజేస్తూ వుండాలని నిర్ణయించినట్లు తెలిపారు.

బిజెపి, కాంగ్రెస్, సిపిఐ. సిపిఎం, టిడిపి, సిఐటియూ, ఏఐటీయూసీ, జనసమితి, విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మొదలగు అఖిలపక్షాలకు చెందిన జిల్లా నాయకులతో పాటు థామస్ రెడ్డి, రాజిరెడ్డి మరియు జోనల్, రీజినల్ జేఏసీ నాయకులంతా శుక్రవారం ఉదయం నుండి బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరవధిక ధర్నా చేయనున్నారు. ఈ క్రమంలోనే బంద్ కూడా కొనసాగుతుందని ప్రకటించారు. 

read more RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి
అంతే కాకుండ  జేఏపీ చలో కరీంనగర్ పిలుపు నిచ్చారు. జిల్లాలోని 10 డిపోల నుండి కరీంనగర్ కు మొత్తం కార్మికులు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.  మొత్తం రీజియన్ కార్మికులు తెల్లారేసరికి కరీంనగర్ కి రావాలని విజ్ఞప్తి చేశారు. 

చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు జరపకుండా నిరవధికంగా ఈ ధర్నా కొనసాగుతుందని... వారితో ఎంపీ సంజయ్, రాష్ట్ర జేఏసి నాయకులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

బంద్ నేపథ్యంలో శుక్రవారం కూడా గాంధీ సంకల్ప యాత్ర రద్దు చేసినట్లు ఎంపీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మరణించినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉమ్మడిగా బంద్ పాటించాలని ఆయా పార్టీలు, సంఘాల నేతలు నిర్ణయించారు. 

గురువారం రోజంతా బాబు భౌతికకాయం వద్ద బైఠాయించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రభుత్వం స్పందించే వరకు అంత్యక్రియలు జరపబోమంటూ గురువారం ఉదయం నుంచి పట్టుబట్టిన బాబు కుటుంబ సభ్యులు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సహా వివిధ పార్టీలు, సంఘాలు పాలకవర్గాల వైఖరికి నిరసనగా ఆందోళనబాట పట్టారు. 

సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరి వీడి, స్వయంగా ఆర్టీసీతో చర్చలు ప్రారంభిస్తేనే బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బంద్ లో స్కూళ్లు, కాలేజీలు, దుకాణదారులు, టీ, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు, ప్రజా, కుల సంఘాలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. 

RTC Strike: ఆర్టీసీ డ్రైవర్ మృతి... కరీంనగర్ బంద్ పై పోలీసుల ఉక్కుపాదం

కార్మికుడు బాబు మృతికి సంతాప సూచకంగా బంద్ లో పాల్గొనాలని సూచించారు. శాంతియుతంగా జరిగే బంద్ కు పోలీసులు నిర్బంధం విధించకుండా సహకరించాలని ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు విధిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.


 

click me!