భారతదేశంలో ఐటీ నిపుణుల కొరత భారీగా ఉంది. ప్రత్యేకించి డేటా సైన్స్, అనలిటిక్స్ విభాగంలో 97 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గ్రేట్ లెర్నింగ్ సర్వే నిర్ధారించింది. వివిధ నగరాలలోని 100 కంపెనీల్లో 1000 మంది ఉద్యోగులతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
ముంబై: అనలిటిక్స్, డేటా సైన్స్ విషయంలో కంపెనీలు ఆసక్తి చూపుతుండడంతో గతేడాది ఆయా విభాగాల్లో ఉద్యోగాలు 45 శాతం మేర పెరిగాయని ఓ సర్వే చెబుతోంది. అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు గల వ్యక్తుల కొరత వల్ల అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో 97వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆన్‌లైన్ విద్య-సాంకేతిక కంపెనీ గ్రేట్ లెర్నింగ్ సర్వేలో తేలింది. భారతదేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 100 కంపెనీల్లోని 1000 మంది వృత్తినిపుణులతో జరిపిన సర్వే వివరాలివి.
ఏడాదిలోగా 45 ఉద్యోగాల పెరుగుదలతో కంపెనీల ఆసక్తి క్లియర్
ఏడాదిలోపే 45 శాతం మేర ఉద్యోగాలు పెరగడం.. ఆయా కంపెనీలు అనలిటిక్స్‌పై చూపిస్తున్న ఆసక్తికి నిదర్శనం. వీటిలో చాలా వరకు ఉద్యోగాలు ప్రారంభ స్థాయివే. ప్రస్తుతం అయిదేళ్లలోపు అనుభవం ఉన్న వ్యక్తుల కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి.
ఫ్రెషర్ల కోసం కూడా ఉద్యోగాలు రెడీ
ఇక విద్యాభ్యాసం తాజాగా పూర్తి చేసిన కొత్త అభ్యర్థులకు కూడా 21 శాతం మేర అనలిటిక్స్ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది 17 శాతం మాత్రమే అవకాశాలు వీరికి లభించాయి. అనలిటిక్స్ రంగంలో అయిదేళ్లకు పైన అనుభవం ఉన్న వ్యక్తులకు 31 శాతం ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.
అనలిటిక్స్ పై పట్టు సాధిస్తే కొలువు పక్కా
అనలిటిక్స్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారికి అదనంగా ఉద్యోగాలు ఉండడం గొప్ప అవకాశం. అభ్యర్థులు తమ నైపుణ్యాలకు సానపెడితే ఉద్యోగాలు వచ్చినట్లే. కంపెనీలు కూడా నైపుణ్యం గలవారి కోసం ఎదురుచూస్తున్నాయి.
బెంగళూరులోనే నాలుగోవంతు కొలువులు కావాలి
మొత్తం అనలిటిక్స్ విభాగం ఉద్యోగాలు 24 శాతం బెంగళూరులోనే ఉండడం గమనార్హం. ఇక ఢిల్లీలో 22%, ముంబైలో 15%, చెన్నై 7 శాతం మేర అనలిటిక్స్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం అన్ని ఉద్యోగాల్లో 38% మంది బ్యాంకింగ్ రంగం వారే.
ఈ- కామర్స్ లోనే కాస్త బెటర్
రిటైల్ రంగంలో ఉద్యోగాల కల్పన గత ఏడాది 2% మాత్రమే వాటా కలిగి ఉండగా ఈ సారి అది 7 శాతానికి చేరింది. ఈ- కామర్స్, ఫార్మా, వాహన రంగాలు వరుసగా 12%, 13%, 6% చొప్పున ఉద్యోగాలిచ్చాయి. టెలికాంలో మాత్రం గతేడాది 8 శాతంగా ఉన్న ఉద్యోగాలు.. 4 శాతానికి తగ్గాయి.
ఎగుమతులతోనే కొలువులు: ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్
భారత్ నుంచి ఎగుమతులు పెరిగితేనే అధిక ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని ప్రపంచ బ్యాంకు గురువారం ఒక నివేదికలో తెలిపింది. మరింత మంది యువత, మహిళలకు ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవడానికి కార్మిక విధానాలు దోహదం చేస్తాయని ప్రపంచ బ్యాంకు-అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) తన నివేదికలో పేర్కొన్నది. ఎగుమతులు పెరిగితే సగటు వేతనాలు కూడా పెరుగుతాయని ‘ఎక్స్‌పోర్ట్స్ టు జాబ్స్: బూస్టింగ్ ద గెయిన్స్ ఫ్రమ్‌ద ట్రేడ్ ఇన్ సౌత్ ఏషియా’ అనే నివేదికలో వెల్లడించింది.