ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడీబీఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఉద్యోగులను ఎలా భర్తీ చేస్తారు.? అర్హతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా సంస్థలో 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా అందిస్తారు.
పీజీడీబీఎఫ్ కోర్సు:
ఎంపికైన అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ శాఖలు/ కార్యాలయాలు/ కేంద్రాలలో సంబంధిత క్యాంపస్‌లలో 6 నెలల తరగతి గది ట్రైనింగ్, 2 నెలల ఇంటర్న్‌షిప్, నాలుగు నెలల ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ)తో కూడిన 1 సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సును అందిస్తారు. ఇందుకోసం గ్రాడ్యుయేట్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు ఏంటంటే.?
ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ అనంతరం ఏదైనా ఐడీబీఐ బ్రాంచ్‌లో ఉద్యోగం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1వ తేదీన మొదలై మార్చి 12వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు ఫీజుగా ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 1050, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు.?
అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. నెగిటివ్ స్ట్రోక్ ఉంటుంది. ప్రతీ తప్పుడు సమాధానానికి 0.25 మార్కును కట్ చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.