Taliban: తాలిబాన్ల షాకింగ్ కామెంట్.. కశ్మీర్‌లోని ముస్లింల కోసం గళమెత్తడం తమ హక్కు అని ప్రకటన

By telugu teamFirst Published Sep 3, 2021, 1:05 PM IST
Highlights

తాలిబాన్లు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాటను నీటిమూటలుగా మారుస్తూ తాము కశ్మీర్‌లోని, భారత్‌లోని ముస్లింల కోసం గళమెత్తుతామని, అది తమ హక్కు అని ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. కశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తాము అందులో జోక్యం చేసుకోబోమని గతంలో పేర్కొంది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తాలిబాన్లు మాటపై నిలబడరని మరోసారి రుజువైంది. ఈ సారి ఏకంగా మనదేశంలో అంతర్భాగంగా ఉన్న కశ్మీర్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లింల గురించి గళమెత్తుతామని ప్రకటించారు. అంతేకాదు, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. అంతకు క్రితం ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై యూటర్న్ తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు తాలిబాన్లు చేసిన సుతిమెత్తని ప్రకటనలను నిజంగానే విశ్వసించవచ్చా? అనే ఆందోళనలో అంతర్జాతీయ సమాజంలో ఆలోచనలో పడింది.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి సుహేల్ షహీన్ ఈ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్, ఇండియా, మరే దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తుతాం. ముస్లింలుగా అది మా హక్కు’ అని దేశాలకు షాక్ ఇచ్చారు.

‘మేం తప్పకుండా వారి గురించి మాట్లాడుతాం. ముస్లింలు మీ సొంత ప్రజలని చెబుతాం. మీ సొంత పౌరులని వారికి తెలియజేస్తాం. వారి చట్టాల ప్రకారమే ఇతరుల్లాగే వారూ సమాన హక్కుదారులని వివరించి చెబుతాం’ అని మరో మీడియా సంస్థకు వివరించారు.

కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు తాలిబాన్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కశ్మీర్ అంశమనేది భారత్ అంతర్గత అంశమని తెలిపింది. కశ్మీర్ సమస్య పాకిస్తాన్, భారత్‌ల ద్వైపాక్షిక అంశమని వివరించింది. తాము అందులో కలుగజేసుకోమని ప్రకటించింది. కానీ, తాజాగా, ఆ ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడటం ఆందోళన కలిగిస్తున్నది. భారత్ సహా ప్రపంచదేశాల్లో ఎక్కడి ముస్లింలైనా, వారి కోసం తాము గళమెత్తుతామని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రస్తావించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌ను వాడకుండా, ఆ గడ్డపై మనదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరపకుండా కట్టడి చేయడమే లక్ష్యమని వివరించారు. ఇదే అంశంపై భారత ప్రతినిధులు ఖతర్‌లో తాలిబాన్ లీడర్ షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానెక్‌జాయితో భేటీ అయ్యారు.

తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌ సున్నీ, వాహాబీ ఉగ్రసంస్థలకు స్వర్గధామంగా మారే ముప్పు ఉన్నదని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అదే నిజమైతే, ఉగ్రవాదులకు ప్రత్యేక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ మారే ప్రమాదముందని పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఐఎస్ఐఎస్, అల్ ఖైదాలు ప్రత్యేక రాజ్యం కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇప్పుడు తాలిబాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఉగ్రవాద శిబిరాలు వినియోగించుకోవచ్చుననే ఆందోళనలున్నాయి.

దీనికితోడు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల పైచేయిని ఆసరాగా తీసుకుని భారత్‌పై దాడికి కుయుక్తులు పన్నే అవకాశముంది. పాక్ అధికారపార్టీ పీటీఐ నేత దీనిపై ఓ టీవీ డిబేట్‌లోనే విస్మయకర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించడానికి తాలిబాన్లు తమకు సహకరిస్తారని హామీనిచ్చినట్టు పీటీఐ నేత నీలమ్ ఇర్షద్ షేక్ షాక్ ఇచ్చారు.

click me!