అమెరికాలో ఇడా తుఫాన్ భీభత్సం: 44 మంది మృతి, పవర్ కట్, పోటెత్తిన వరద

By narsimha lodeFirst Published Sep 3, 2021, 10:11 AM IST
Highlights

అమెరికాలోని న్యూయార్క్‌లో ఇడా తుఫాన్ కారణంగా సంబవించిన వరదల్లో  సుమారు  44 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో తుఫాన్ విధ్వంసం సృష్టించింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు.


న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో  ఇడా తుఫాన్ కారణంగా సంబవించిన వరదల్లో గురువారం రాత్రి వరకు 44 మంది మరణించారని అధికారులు ప్రకటించారు.  భారీ వర్షం కారణంగా న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. వీధుల్లో వరద నీరు పోటెత్తింది. దీంతో సబ్‌వే లను మూసివేశారు. 

తన 50 ఏళ్ల జీవితంలో ఇంత పెద్ద వర్షాన్ని చూడలేదని మన్హట్టన్ రెస్టారెంట్ కు చెందిన మెటోడిజా మిహాజ్‌లోవ్ చెప్పారు. తన రెస్టారెంట్ లో మూడు అడుడుల నీరు నిండిపోయిందన్నారు.ఈ పరిస్థితిని చూస్తే అడవిలో నివసించినట్టుగా ఉందన్నారు. ఈ ఏడాదిలో అన్ని చాలా వింతగా జరుగుతున్నాయని ఆయన ఓ న్యూస్ ఛానెల్‌కి చెప్పారు.

టాగార్డియా , జెఎఫ్‌కె ఎయిర్‌పోర్టుల్లో వందలాది విమానాలు రద్దు చేశారు. ఈ ఎయిర్‌పోర్టుల్లోని రన్ వేలు వరద నీటిలో మునిగిపోయాయి.  న్యూయార్క్‌లో ఇడా తుఫాన్ విధ్వంసం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శుక్రవారం నాడు దక్షిణ రాష్ట్రమైన లూసియానా పర్యటనకు వెళ్లే ముందు  ఆయన  ఈ విషయమై మాట్లాడారు. ఇడా తుఫాన్ బాధితులను ఆదుకొంటామని ఆయన ప్రకటించారు. ఈ తుఫాన్ కారణంగా 1 మిలియన్ పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

న్యూజెర్సీ, న్యూయార్స్‌లలోని మాన్హాటన్, ది బ్రోంక్స్ ,క్వీన్స్‌లలోని ప్రధాన రోడ్లను మూసివేశారు. కార్లు మునిగిపోయాయి. వందలాది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ వరదల కారణంగా సుమారు 23 మంది మరణించారని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ  మీడియాకు తెలిపారు.వరదల కారణంగా తమ వాహనాల్లో చిక్కుకొన్నవారే ఎక్కువగా మృతి చెందారని గవర్నర్ చెప్పారు.

న్యూయార్క్ నగరంలో 13 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో రెండేళ్ల నుండి 86 ఏళ్ల వయస్సున్నవారు కూడా ఉన్నారని చెప్పారు.న్యూయార్క్ శివారు వెస్ట్‌‌చెస్టర్ లో ముగ్గురు, పెన్సిల్వేన్వియాలోని ఫిలడెల్ఫియాలో వెలుపల ఉనన్ మోంట్‌గో మేరీ కౌంటీలో మరో నలుగురు మరణించినట్టుగా స్థానిక అధికారులు తెలిపారు.

న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులను ప్రకటించారు. నేషనల్ వెదర్ సర్వీస్ న్యూయార్క్ లో  తొలి అత్యవసర ఫ్లాష్ వరద హెచ్చరికను జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.ఎన్‌డబ్ల్యుఎస్ సెంట్రల్ పార్క్‌లో 80 మి.మీ. వర్షపాతం గంటలో నమోదైంది. ఈ తుఫాన్ కారణంగా యూఎస్ ఓపెన్ కూడ నిలిచిపోయింది.

గురువారం సాయంత్రానికి పెన్సిల్వేనియాలో 38 వేలు, న్యూజెర్సీలో 24 వేలు, న్యూయార్క్ లో 12 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. అమెరికాలోని ఈశాన్య సముద్రతీరంలో ఇలాంటి తుఫాన్ లు సంబవించడం చాలా అరుదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

వాతావరణంలో మార్పుల కారణంగా ఈ రకమైన తుఫానులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కనెక్టికట్, ఉత్తర న్యూజెర్సీ, దక్షిణ న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో సుడిగాలులు వీచే ప్రమాదం ఉందని ఎన్‌డబ్ల్యుఎస్ హెచ్చరించింది.

click me!