స్కూల్ నుంచి 70 మంది చిన్నారుల కిడ్నాప్.. తుపాకులు పట్టుకుని దుండగుల వీరంగం

By telugu teamFirst Published Sep 2, 2021, 7:22 PM IST
Highlights

నైజీరియాలో కొన్ని ముఠాలు తుపాకులు పట్టుకుని బెదిరిస్తూ పాఠశాలల నుంచి పిల్లలను కిడ్నాప్ చేసి వారిని విడుదల చేయడానికి తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కనీసం 12కిపైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా, ఇందులో 1,100 మందికిపైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు. తాజాగా, జంఫారా రాష్ట్రంలోని కాయా గ్రామంలో 73 మంది పిల్లలను కిడ్నాప్ చేశారు.

న్యూఢిల్లీ: నైజీరియాలో తుపాకులు పట్టుకున్న కొందరు దుండగులు ఓ స్కూల్‌లోకి వెళ్లి కనీసం 70 మంది చిన్నారులను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆ ఊరి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు ఊరి చుట్టుముట్టారు. నిందతుల కోసం గాలింపులు చేస్తున్నారు. జంఫారా రాష్ట్రంలోని కాయా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నైజీరియాలో తుపాకులు పట్టుకుని కొందరు దుండగులు డబ్బులు వసూలు చేయడానికి ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. ఇందులో భాగంగానే ఆ దేశంలో పాఠశాలల్లోకి వెళ్లి పిల్లలను కిడ్నాప్  చేసి తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో నగదు డిమాండ్ చేస్తుంటారు. ఇందుకోసం తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టి, అమ్ముకుని వచ్చినదాన్ని దుండగుల చేతిలో పెట్టి పిల్లలను వెనక్కి తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఇది వరకు చాలా సార్లు జరిగాయి. తాజాగా, బుధవారం ఉదయం దేశంలోని వాయవ్య రాష్ట్రం జంఫారాలో చోటుచేసుకుంది.

పెద్దమొత్తంలో సాయుధుల గుంపు కాయా గ్రామంలోని స్కూల్‌లోకి జొరబడి 73 మంది పిల్లలను అపహరించుకుపోయారని జంఫార్ పోలీసు ప్రతినిధి మొహమ్మద్ షేహు వెల్లడించారు. దుండగులను గాలించడానికి ప్రత్యేకంగా సెర్చ్, రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 23వేల మంది జనాభా గల కాయా గ్రామంలో భారీగా బలగాలు మెహరించాయని చెప్పారు.

ఈ కిడ్నాప్ కారణంగా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రైమరీ, సెకండరీ పాఠశాలలన్నింటిని మూసేయాలని ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. అంతేకాదు, ప్రయాణాలపై ఆంక్షలు విధించారని, నైట్ కర్ఫ్యూ కూడా విధించినట్టు పేర్కొన్నారు. దుండగులను పట్టుకోవడానికి వీలైన మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు.

నైజీరియాలో గతేడాది డిసెంబర్ నుంచి కనీసం 12కుపైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 1,100 మంది పిల్లలను కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజుకుని పిల్లలను వదిలేశారు. పేమెంట్ జాప్యం కారణంగా కొన్నిసార్లు పిల్లలు గాయాలపాలవ్వడమే కాదు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నట్టు స్థానికులు చెప్పారు. ఇలాగే కిడ్నాప్ చేసిన 90 మంది చిన్నారులను శుక్రవారం విడుదల చేశారు.

click me!