
న్యూఢిల్లీ: చైనాలో గత కొంత కాలంగా బ్యాంకు డిపాజిటర్లు ధర్నా చేస్తున్నారు. పలు చోట్ల బ్యాంకు ఖాతాదారులు ఆందోళన పట్టిన.. పడుతున్న వార్తలు వస్తున్నాయి. తాజాగా, హెనాన్ ప్రావిన్స్‌లోనూ బ్యాంకు ఖాతాదారులు ధర్నా చేశారు. వీరిని చెదరగొట్టడానికి చైనా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఫలితంగా ఆదివారం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఆందోళనలకు ప్రధాన కారణం ఖాతాదారులు.. తాము ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్మును పొందలేకపోవడం.
ఈ సెంట్రల్ ప్రావిన్స్‌లోని నాలుగు రూరల్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్న వారు.. వారి సొంత డబ్బునే పొందలేకపోతున్నారు. ఏప్రిల్ నుంచి ఈ డిపాజిట్లను బ్యాంక్ ఫ్రీజ్ చేసింది. తద్వారా వారు తమ డబ్బులనే బ్యాంకుల నుంచి తీసుకోలేకపోతున్నారు. మే నెల నుంచి చైనాలో ఇలా బ్యాంకు డిపాజిటర్ల ఆందోళనలు రిపోర్ట్ అవుతున్నాయి.
ఆదివారం ఆందోళనల తర్వాత చైనా బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఓ ప్రకటన చేసింది. ఖాతాదారులకు కాస్త ఉపశమనం ఇచ్చింది. గరిష్టంగా 50 వేల యువాన్ల వరకు డిపాజిట్లు చేసిన కస్టమర్లు తమ డబ్బును శుక్రవారం నుంచి పొందగలుగుతారని వివరించింది. అయితే, అంతకు పైగా డిపాజిట్లు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.
బ్యాంక్ రన్ అంటే ఏమిటీ?
బ్యాంకు నుంచి ఏకకాలంలో లేదా అతి తక్కువ సమయంలోనే తమ డబ్బును వాపసు తీసుకోవడానికి డిపాజిటర్లు పరుగు పెడితే.. బ్యాంకులు డబ్బుల్లేక డిపాజిట్లను ఫ్రీజ్ చేయడాన్నే బ్యాంక్ రన్ అనవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాలో చిన్న బ్యాంకుల్లో ఈ బ్యాంక్ రన్ పరిస్థితులు తరుచూ చోటుచేసుకోవడాన్ని గమనించవచ్చు. తాము డిపాజిట్లు చేసిన బ్యాంకులపై అపనమ్మకం లేదా ఇతర కారణాల వల్ల డిపాజిటర్లు బ్యాంకు నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడానికి వెళ్లితే బ్యాంక్ రన్ ఏర్పడుతుంది. హెనాన్ ప్రావిన్స్‌లో 2019లో రెండు చిన్న బ్యాంకులు, 2020లో ఐదు చిన్న బ్యాంకులు ఈ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. దీంతో తమ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందేనని డిపాజిటర్లు ధర్నా చేస్తున్నారు.
కొన్ని బ్యాంకులు తొలుత ఇంటర్నల్ మెయింటెనెన్స్ అంటూ విత్ డ్రాయల్స్ నిలిపేశాయి. ఆ తర్వాత ఆర్థిక మోసం జరిగినట్టు తేలింది. థర్డ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పౌరుల నుంచి అక్రమంగా డబ్బును ఆకర్షించే విధానంతో ఈ బ్యాంక్ రన్ ఏర్పడినట్టు చైనా బ్యాకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ (సీబీఐఆర్‌సీ) వివరించింది. ప్రజా ధనాన్ని థర్డ్ ప్లాట్ ఫామ్‌లు, ఫండ్ బ్రోకర్ల ద్వారా ఓ షేర్ హోల్డర్ సమీకరించిందని తెలిపింది. ఈ బ్యాంకులు తొలుత అత్యధిక వడ్డీలు ఇస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుని తర్వాత మోసం చేశాయి.
అయితే, భారీగా ఉన్న చైనా బ్యాంకింగ్ రంగంలో రూరల్ బ్యాంకుల సమస్యలు పెద్దగా ప్రభావం వేయకపోవచ్చని బ్లూమ్ బర్గ్ కథనం తెలిపింది.