
Sri Lanka Economic Crisis: స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఎప్పుడూ చూడని ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని శ్రీలంక. రోజురోజుకూ పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతున్నాయి. దీనికి కారణంగా రాజపక్సే కుటుంబ పాలనే అని ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్ష్యక్షుడు గొటబయ రాజపక్సే అక్కడి నుంచి పారిపోయారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ద్వీప దేశంలో సాయుధ దళాల రక్షణలో ఉన్న గోటబయ, జూలై 13 నాటి తన రాజీనామా లేఖపై సోమవారం సంతకం చేశారనీ, పార్లమెంటు స్పీకర్ దీనిని జూలై 13న దేశానికి బహిరంగంగా ప్రకటిస్తారని డైలీ మిర్రర్ నివేదించింది.
ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్‌తో అవమానకరమైన ప్రతిష్టంభన తర్వాత మంగళవారం నాడు అక్కడి నుంచి పారిపోవడానికి శ్రీలంక అధ్యక్షుడు నేవీ పెట్రోలింగ్ క్రాఫ్ట్‌ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు AFP అధికారిక వర్గాలు తెలిపాయి. శనివారం పదివేల మంది నిరసనకారులు కొలంబోలోని తన అధికారిక నివాసాన్ని ఆక్రమించుకునేలోపే గొటబయ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లాలనుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆయన అరెస్టు నుంచి రక్షణ పొందడానికి.. తన పదవి రాజీనామా చేసే ముందు విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని పాస్‌పోర్ట్‌ను స్టాంప్ చేయడానికి VIP సూట్‌కు వెళ్లడానికి నిరాకరించారు. అక్కడి ఇతర ప్రయాణికులు సైతం నిరసన తెలిపారు. దీంతో ఆయన ఇతర మార్గాలపై దృష్టి సారించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తీసుకెళ్లగలిగే నాలుగు విమానాలు మిస్ అయిన తర్వాత అధ్యక్షుడు, అతని భార్య బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఉన్న సైనిక స్థావరంలో రాత్రి గడిపారు. ఏప్రిల్‌లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజపక్సే చిన్న సోదరుడు బాసిల్ రాజపక్సే సైతం దుబాయ్ కి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే, ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. , విమానాశ్రయ సిబ్బందితో పాటు అక్కడున్న ప్రయాణికుల నుంచి ఆయన నిరసన సెగ తగిలింది. ఆయనకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చారు. శ్రీలంక జాతీయతతో పాటు US పౌరసత్వాన్ని కలిగి ఉన్న బాసిల్ అమెరికాకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం కొలంబో కోర్టు కస్టడీలో ఉన్న 17.85 మిలియన్ రూపాయల నగదుతో పాటు డాక్యుమెంట్లతో కూడిన సూట్‌కేస్ అధ్యక్ష భవనంలోనే ఉంచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, అతని ఆచూకీ గురించి అధ్యక్ష కార్యాలయం నుండి అధికారిక సమాచారం లేదు, కానీ అతను సైనిక వనరులతో సైనిక దళాలకు కమాండర్-ఇన్-చీఫ్‌గా రక్షణలోనే ఉన్నారని తెలిసింది. అధ్యక్షుడి సన్నిహిత సైనిక సహాయకులు ఆయనను, అతని పరివారాన్ని నౌకాదళ పెట్రోలింగ్ క్రాఫ్ట్‌లో విదేశాలకు తీసుకెళ్లే అవకాశం గురించి చర్చిస్తున్నారని అక్కడి రక్షణ వర్గాలు నుంచి సమాచారం అందుతున్నదని మీడియా కథనాలు వస్తున్నాయి. రాజపక్సే, అతని సహాయకులను ఈశాన్య ఓడరేవు నగరమైన ట్రింకోమలీకి తీసుకెళ్లడానికి శనివారం నేవీ బోట్‌ను ఉపయోగించారు. అక్కడి నుండి సోమవారం అంతర్జాతీయ విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో తిరిగి వచ్చారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు సముద్ర మార్గమే ఉత్తమమని ఆయన భావిస్తున్నరని సమాచారం. భారత్ లేదా మాల్దీవులకు చేరుకునీ, అక్కడి నుంచి దుబాయ్ వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది.