వైరస్ వ్యాప్తి తగ్గితే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను దశలవారీగా సడలించుకోవాలని లేదంటే తిరిగి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 37లక్షల మందికి సోకగా.. రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ వైరస్ ని అరికట్టేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ విధించగా... నెమ్మదిగా ఇప్పుడిప్పుడే వాటిని ఎత్తివేస్తున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నందున కరోనా ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. జెనీవాలో వర్చువల్ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు కరోనా వైరల్ వ్యాధి వ్యాప్తిని తనిఖీ చేయడానికి తగిన ట్రాకింగ్ వ్యవస్థలు, నిర్బంధ నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు.
undefined
వైరస్ వ్యాప్తి తగ్గితే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను దశలవారీగా సడలించుకోవాలని లేదంటే తిరిగి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ ను త్వరగా ఎత్తివేస్తే కరోనా వైరస్ వ్యాప్తిచెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్దోవ్ కూడా హెచ్చరించారు.
జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలు లాక్ డౌన్ ను సడలించడం ప్రారంభించాయని, అమెరికాలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను ఎప్పుడు ఎలా ముగించాలో ప్రభుత్వాలు నిర్ణయించాలని, మహమ్మారి తగ్గిన తర్వాతే ఆంక్షలు సడలించాలని మైక్ ర్యాన్ సూచించారు.