కొవాగ్జిన్‌‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..

By team teluguFirst Published Oct 27, 2021, 11:38 AM IST
Highlights

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు(Covaxin) ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులకు మరోసారి అడ్డంకి ఏర్పడింది. కొవాగ్జిన్ అత్యవసర అనుమతులను డబ్ల్యూహెచ్‌వో మరోసారి పెండింగ్‌లో పెట్టింది.

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు(Covaxin) ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులకు మరోసారి అడ్డంకి ఏర్పడింది. కొవాగ్జిన్ అత్యవసర అనుమతులను డబ్ల్యూహెచ్‌వో మరోసారి పెండింగ్‌లో పెట్టింది. కొవాగ్జిన్ కు సంబంధించి అదనపు సమాచారం కావాలని డబ్ల్యూహెచ్ఓకు చెందిన సాంకేతిక సలహా సంఘం మంగళవారం భారత్ బయోటెక్‌ను కోరింది. కొవాగ్జిన్ కు అనుమతుల జారీ ప్రక్రియ తుది అంకంలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ వర్గాలు పేర్కొన్నాయి. కొవాగ్జిన్ టీకా యొక్క అత్యవసర వినియోగ జాబితా కోసం తుది "రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్" నిర్వహించడానికి డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం నవంబర్ 3వ తేదీన సమావేశం కానుంది. 

కొవాగ్జిన్ టీకాను అత్యవసర జాబితాలో చేర్చాలని భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసుకన్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) కోసం ఈవోఐ(ఎక్ప్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్) సమర్పించింది. ఈ క్రమంలోనే జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టుగా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు అవసరమైన సమాచారాన్ని World Health Organisationకు ఇప్పటికే సమర్పించామని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే టీకా యొక్క అత్యవసర వినియోగ జాబితా కోసం.. కొవాగ్జిన్ డేటాను సమీక్షించడానికి సాంకేతిక సలహా బృందం మంగళవారం సమావేశమైంది.

Also read: ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది.. ట్విట్టర్‌లో సంచన పోస్టులు చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణ పోలీసుల వీడియోలతో..

"ఈరోజు (26 అక్టోబర్ 2021) సాంకేతిక సలహా సంఘం సమావేశమై.. వ్యాక్సిన్ యొక్క గ్లోబల్ ఉపయోగం కోసం తుది ఈయూఎల్ ప్రమాద-ప్రయోజన అంచనాను నిర్వహించడానికి తయారీదారు నుంచి అదనపు వివరణలు అవసరమని నిర్ణయించింది’ అని పీటీఐ ప్రశ్నకు ఇమెయిల్ ద్వారా డబ్ల్యూహెచ్‌వో సమాధానం ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.  డబ్ల్యూహెచ్‌వో అదనపు సమాచారం కోరడంతో ఈ పక్రియ పూర్తి కావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. 

Also read: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఏపీలో వర్షాలు..

డబ్ల్యూహెచ్ఓ అనుమతులు లభిస్తే కొవాగ్జిన్ ను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగించడానికి వీలు కలుగుతుంది. అదే సమయంలో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న భారతీయులు పలు దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లవచ్చు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

click me!