WHO on Omicron: ఒమిక్రాన్‌ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన.. ఎన్ని దేశాలు కేసులు రిపోర్టు చేశాయంటే..?

By team teluguFirst Published Dec 2, 2021, 1:00 PM IST
Highlights

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ (Omicron) వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) కీలక ప్రకటన చేసింది. ఐదు రీజియన్ల‌లోని దేశాలు కేసులు రిపోర్ట్ చేశాయని డబ్ల్యూహెచ్‌వో (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడనోమ్ ఘెబ్రయెసుస్‌ (Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. 
 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ (Omicron) వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 23 దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులను నివేదించాయని డబ్ల్యూహెచ్‌వో బుధవారం వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో ఆరు రీజయన్లలోని.. ఐదు రీజియన్లలోని 23 దేశాల్లో ఈ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయని చెప్పింది. ఆ సంఖ్య మరింతగా పెరుగుతుందని తాము భావిస్తున్నట్టుగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడనోమ్ ఘెబ్రయెసుస్‌ (Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. బుధవారం ఆయన జెనీవాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒమిక్రాన్ వ్యాప్తిని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా చెప్పారు. ప్రతి దేశం కూడా అదే అప్రమత్తతో ఉందన్నారు.  వ్యాప్తి చెందడం వైరస్‌ల పని అని.. మనం అనుమతించనంత కాలం వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందన్నారు. 

‘ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన అందుతున్న సాక్ష్యాలను అంచనా వేయడానికి, ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వడానిని అవసరమైన అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక డబ్ల్యూహెచ్‌వో సలహా బృందాలు గత రెండు రోజులుగా సమావేశమయ్యాయి. కొత్త వేరియంట్‌ను గుర్తించి, సీక్వెన్సింగ్ చేసి.. రిపోర్ట్ చేసిన బోట్స్‌వానా, దక్షిణాఫ్రికాక కృతజ్ఞతలు’ అని టెడ్రోస్ తెలిపారు. అయితే ఆ దేశాలకు శిక్ష విధించబడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

సరైన పనిచేసిన దేశాలు.. ఇతర దేశాల చేత శిక్షించబడం తనకు ఆందోళన కలిగిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా, హేతుబద్దమైన ప్రమాద తగ్గింపు చర్యలను తీసుకోవాలని అన్ని దేశాలకు టెడ్రోస్ పిలుపునిచ్చారు. కొత్త వేరియంట్ వ్యాప్తి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు .. విదేశాలకు ప్రయాణించేవారిని ప్రయాణానికి ముందు, తర్వాత స్క్రీనింగ్ చేయడం, క్వారంటైన్‌లో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ హై రిస్క్‌ దేశాలకు పూర్తిగా ప్రయాణాలను నిషేధించడానికి వ్యతిరేకించారు. ఇలాంటి చర్యలు ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించవని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల జీవితాలు, జీవనోపాధిపై భారాన్ని మోపుతాయని టెడ్రోస్ అబిప్రాయపడ్డారు. 

Also read: Omicron : ‘ప్రస్తుతం డేంజర్ కాదు.. కానీ నమ్మలేం...’ దక్షణాఫ్రికా సైంటిస్టుల కొత్త హెచ్చరిక...

అధిక సాంక్రమిక శక్తి కలిగిన, ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ఇప్పటికే పోరాడుతున్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. డెల్టా వేరియంట్‌ వ్యాప్తిని నిరోధించడానికి, ప్రాణాలను రక్షించడానికి వినియోగించిన సాధానాలను.. ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడానికి కూడా వినియోగించాలని సూచించారు.  అయితే ఇంకా కొన్ని చోట్ల తక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్, వైరస్ నిర్దారణ పరీక్షలు ఉండటం ఆందోళన కలిగించే విషయం అని  టెడ్రోస్ చెప్పారు. 

ఇక, అమెరికాలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదైంది. కాలిఫోర్నియాలో తొలి కేసు నిర్దారణ అయినట్టుగా యుఎస్ ధృవీకరించింద. ఈ వివరాలను అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ బుధవారం తెలిపింది. పూర్తిగా టీకాలు వేసిన ఓ వ్యక్తి.. నవంబర్ 22న దక్షిణాఫ్రికా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో‌కు తిరిగి వచ్చారని.. నవంబర్ 29న ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు.

వారం క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగూసిన ఈ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు వెంటనే అంతర్జాతీయ ప్రయాణాలపనై ఆంక్షలు విధించాయి. దక్షిణాఫ్రికాతో పాటు ఈ వేరియంట్ గుర్తించన దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించాయి.

Also read: Omicron: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించారు?.. వారు ఎందుకు భయాందోళన చెందారు..?

అయితే ఈ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌.. 30 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే ఈ మ్యూటేషన్స్ యాంటీబాడీల రక్షణను తగ్గించడంతో.. అధిక వేగంతో వ్యాప్తి చెందడానికి అవకావశం ఉంది. 

click me!