Russia Ukraine Crisis:యుద్ధానికి కారణం నాటో కూటమేనా? నాటో అంటే ఏమిటి? రష్యా ఎందుకు ద్వేషిస్తుంది?

Published : Feb 24, 2022, 02:04 PM IST
Russia Ukraine Crisis:యుద్ధానికి కారణం నాటో కూటమేనా? నాటో అంటే ఏమిటి? రష్యా ఎందుకు ద్వేషిస్తుంది?

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ప్రధాన కారణంగా నాటో కూటమి ఉన్నది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ను చేర్చుకోకుండా హామీ ఇవ్వాలని పశ్చిమ దేశాల నుంచి రష్యా హామీ అడిగింది. కానీ, సమాధానం రాలేదు. ఇంతటి నాటో అంటే ఏమిటి? దానిపై రష్యాకు ఎందుకంత ద్వేషం?

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడి చేయడం వెనుక ప్రధాన కారణం నాటో కూటమి కనిపిస్తున్నది. ఈ దాడికి పూర్వం గతేడాది డిసెంబర్‌లోనే రష్యా పశ్చిమ దేశాలకు తమ డిమాండ్లు పంపింది. నాటో కూటమిలోకి ఉక్రెయిన్ దేశాన్ని ఎప్పటికీ చేర్చుకోబోమన్న హామీ ఇవ్వాలని, అలాగే, తూర్పు ఐరోపా వైపు నాటో విస్తరణ ఆపేయాలని రష్యా డిమాండ్ చేసింది. 1997 మిలిటరీ స్టేటస్‌ను మాత్రమే నాటో గుర్తించుకోవాలని పుతిన్ కోరారు. అంటే.. ఆ తర్వాత నాటో నిర్మించుకున్న మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రద్దు చేసుకోవాలని. వీటితోపాటు మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఈ ప్రధాన డిమాండ్లను పశ్చిమ దేశాలు తిరస్కరించినట్టుగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించింది. పశ్చిమ దేశాల హెచ్చరికలు అన్నింటినీ ఖాతరు చేయలేదు. ఇంతకు నాటో కూటమి అంటే ఏమిటి? అదంటే రష్యాకు ఎందుకు పడదు?

నాటో అంటే?

రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం వెనుక నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో) ఉన్నది. ఈ ఆర్గనైజేషన్ 1949లో ఉనికిలోకి వచ్చింది. ఉక్రెయిన్ దేశం ఈ నాటో కూటమిలో చేరాలని అనుకుంటున్నది. కానీ, రష్యా అందుకు తిరస్కరిస్తున్నది. ఒక వేళ ఉక్రెయిన్ కూడా నాటో కూటమిలో చేరితే.. నాటో దేశాల బలగాలు రష్యా సరిహద్దులోకి వచ్చినట్టే అవుతుంది. ఇంతకు రష్యాకు, నాటో కూటమికి మధ్య వైరం ఎక్కడ మొదలైందో ఓ సారి చూద్దాం.

రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్య కాలంలో జరిగింది. నాజీల నుంచి పలు దేశాలను రక్షించడంలో.. హిట్లర్‌కు చరమ గీతం పాడటంలో రష్యా కీలకంగా వ్యవహరించింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం సోవియట్ యూనియన్ తూర్పు ఐరోపా దేశాల్లో విస్తరించిన తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. 1948లో బెర్లిన్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది. దీంతో అమెరికా దేశం సోవియట్ యూనియన్ విస్తరణకు అడ్డుకట్ట వేయాలని భావించింది. ఆ ఆలోచనల నుంచే నాటో కూటమి 1949లో ఆవిర్భవించింది. 

నాటో ఆవిర్భవించినప్పుడు 12 సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, ది నెదర్లాండ్స్, ఐస్‌లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్, నార్వే, పోర్చుగల్, డెన్మార్క్ దేశాలు ఈ కూటమిలో అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమిలో సభ్య దేశాల సంఖ్య 30కి చేరాయి. నాటో అనేది ఒక మిలిటరీ కూటమి. కామన్ సెక్యూరిటీ పాలసీ కింద పని చేసే ఆర్గనైజేషన్. అంటే.. సభ్య దేశాలన్నీ కలిసి ఏ ముప్పు వచ్చినా కలిసి ఎదుర్కోవాలనే లక్ష్యంగా ఇది ఏర్పడింది. ఒక వేళ నాటో సభ్య దేశాన్ని మరే దేశం దురాక్రమించినా.. మిగిలిన దేశాలు అన్నీ ఆ దేశంపై దాడికి సిద్ధం అవుతాయి.

రష్యాకు ఉక్రెయిన్‌తో ఉపద్రవమేంటి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు శిబిరాలుగా చీలిపోయింది. అమెరికా, సోవియట్ యూనియన్ రెండు సూపర్ పవర్లుగా వాటికి నేతృత్వ స్థానంలో ఉన్నాయి. కానీ, 1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ కుప్పకూలింది. దీంతో ఆ యూనియన్ 15 దేశాలుగా అర్మేనియా, అజర్‌బైజన్, బెలారస్, ఎస్టోనియా, జార్జియా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, లాట్వియా, లిథువేనియా, మోల్డోవా, రష్యా, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్‌లుగా విడిపోయాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత అమెరికా మాత్రమే ప్రపంచంలో సూపర్ పవర్‌గా మిగిలింది. అమెరికా సారథ్యంలో నాటో వేగంగా విస్తరించింది. సోవియట్ యూనియన్ శిబిరంలో గతంలో ఉన్న దేశాలు కూడా మెల్లగా నాటోలో చేరడం మొదలయ్యాయి. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలూ 2004లో నాటో కూటమిలో చేరాయి. జార్జియా, ఉక్రెయిన్‌లకూ నాటో సభ్యత్వ ఆఫర్ 2008లో వచ్చింది. కానీ, అవి ఇంకా చేరలేదు.

నాటో విస్తరణను పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఇప్పుడు మా ఇంటి ముందు క్షిపణులతో నిలబడి ఉన్నదని ఆయన 2021 డిసెంబర్‌లో పేర్కొన్నారు. ఒక వేళ కెనడా, మెక్సికో సరిహద్దుల్లో తాము క్షిపణులతో మోహరించి ఉంటే అమెరికాకు ఎలా అనిపిస్తుంది? అంటూ సూటి ప్రశ్న వేశారు. ఒక వేళ ఉక్రెయిన్ కూడా నాటో కూటమిలో చేరితే.. రష్యా దేశాన్ని నాటో కూటమి చుట్టేసినట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ యూరప్‌తో అనుసంధానంలో ఉన్న కీలక దేశాలు ఇవి. అందుకే ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి