మనుషులూ విషం కక్కుతారు.. ! మనలోనూ విషం తయారీ వ్యవస్థ !!

By AN TeluguFirst Published Mar 31, 2021, 9:35 AM IST
Highlights

మనిషికి నిలువెల్లా విషమే అని నానుడి.. అదే నిజం కాబోతోంది అంటున్నాయి తాజా పరిశోధనలు. సమీప భవిష్యత్తులో పాముల్లో మాదిరిగానే మన లాలాజంలోనూ విషం ఊరే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. 

మనిషికి నిలువెల్లా విషమే అని నానుడి.. అదే నిజం కాబోతోంది అంటున్నాయి తాజా పరిశోధనలు. సమీప భవిష్యత్తులో పాముల్లో మాదిరిగానే మన లాలాజంలోనూ విషం ఊరే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. 

మానవ పరిణామంలో ఇదీ ఒక భాగమే అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ లోని ఒకినావా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పిట్ వైపర్ అంటే రక్త పింజర పాముల మీద పరిశోధనలు చేశారు. ఈ పాముల కోరల్లో విషానికి సంబంధించిన జన్యువుల గురించి తెలుసుకునేందుకు పరిశోధనలు జరిగాయి. 

ఈ క్రమంలో నోట్లో విషస్రావాలు వచ్చేందుకు దోహదపడే జన్యువుల సరీసృపాలతో పాటు మానవుల్లో కూడా ఉన్నాయని, దీన్ని బట్టి మానవులు కూడా భవిష్యత్తులో విషం కక్కే రోజులు వస్తాయని చెబుతున్నారు. 

మానవుల లాలాజల గ్రంథులు, పాముల్లోని విష గ్రంథుల అమరిక కణ స్థాయిలో ఒకేరకంగా ఉంటాయని రుజువులు చూపిస్తున్నారు. అందుకే తాము ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. విషయం అనేది ప్రోటీన్ల మిశ్రమం అని, జంతువులు తమ ఆహారాన్ని కదలకుండా చేసేందుకు, స్వీయ రక్షణ కోసం ఈ ఆయుధాన్ని వాడుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న అగ్నీష్ బారువా అనే సైంటిస్ట్ తెలిపాడు. 

ఇలాంటి విషం కొన్ని క్షీరదాలతో పాటు జెల్లీఫిష్, తేళ్లు, సాలీళ్లు, పాముల్లో ఉంటుంది. చాలా జంతువులు తమ నోటి ద్వారానే విషం విడుదల చేస్తాయి. విషంలోని ప్రోటీన్ల మిశ్రమం తయారయ్యేందుకు ప్రభావితం చేసే జన్యువుల గురించి గతంలో పరిశోధనలు జరిగాయి. కానీ తాజాగా వివిధ జన్యువులు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసుకుంటాయని పరిశోధనలు చేస్తున్నాయి. 

‘విషం, విషగ్రంథులు ఆవిర్భవించక ముందు ఉన్న జన్యువులు, విష వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన జన్యువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని బారువా చెప్పారు. ఇందుకోసం తైవాన్ కు చెందిన హబు పాముల విషంమీద కూడా అధ్యయనం చేశారు. దాదాపు 3వేల  ‘సహకార’ జన్యువులను వీరు గుర్తించారు. 

ఇలాంటి జన్యువులు మరే జంతువుల్లోనైనా ఉన్నాయా అని పరిశోధకులు వెతికారు. కుక్కలు, చింపాంజీలు, మానవుల వంటి క్షీరదాల్లో వాటి వెర్షన్లలో ఈ జన్యువులు ఉన్నట్లు గుర్తించారు. క్షీరదాల్లోని లాలాజల గ్రంథుల నిర్మాణం, కణాల అమరిక అచ్చు.. పాముల్లోని విష గ్రంథులలాగే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ రెండు జాతులు కోట్ల సంవత్సరాల కింద వేరు పడడానికి ముందునుంచీ ఈ గ్రంథులకు సంబంధించి ఒకే మూలాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. పర్యావరణ పరిస్థితులు కనుక మనకు అనుకూలంగా లేకపోతే త్వరలోనే మన లాలాజన గ్రంథులు కాస్తా విష గ్రంథులుగా రూపాంతరం చెందినా చెందొచ్చు. 

click me!