
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చిన్న నాయనమ్మ, అనాథల జీవితాల్లో అక్షరాలతో వెలుగులు నింపిన మామా సారా కన్నుమూశారు. 99 యేళ్ల వయస్సులో సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
కెన్యాలోని కిసుములో ఉన్న జరమోగి ఒడింగా ఒడింగా టీచింగ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఒబామా తండ్రికి పినతల్లి అయిన సారా, సంఘసేవకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అనాథలు, బాలికలకు విద్యను అందించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. ఒబామా తండ్రి సీనియర్ ఒబామాను స్కూల్ కు తీసుకువెళ్లడానికి రోజూ తొమ్మిది కిలోమీటర్లు సైకిలు తొక్కేవారట. తమ గ్రామం కోగెలో నుంచి ఎన్జీయా నగరానికి ఆయన్ని తీసుకు వెళ్లి చదువు చెప్పించేవారట.
ఒబామా రాసిన ‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’ పుస్తకంలో తన చిన్న నాయనమ్మ అయిన మామా సారా గురించి ప్రస్తావించారు. ఆమెను తాను 1988లో తొలిసారి కలుసుకున్నట్టు కూడా రాశారు. ఒబామా అధ్యక్షుడిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన సమయంలో ఆమె హాజరయ్యారు.
చదువంటే తను ప్రాణమని చెప్పిన ఆమె.. ఒక మహిళ చదువుకుంటే ఆమె కుటుంబం మాత్రమే చదువకున్నట్టు కాదని, యావత్ గ్రామం చదువుకున్నట్టని చెప్పేవారు. ఎవరైతే విద్యావకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో.. వాళ్లు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేవారు. ఆమె మృతికి కిసుము గవర్నర్ అన్యాంగ్ న్యోంగో సంతాపం తెలిపారు.