
అమెరికాలోని కీలక సైనిక ప్రాంతాలపై గూఢచర్యం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న స్పై బెలూన్‌ను అమెరికా కూల్చివేసింది. ఈ బెలూన్ యూఎస్ గగనతలంలోకి ప్రవేశించిన వారం రోజుల తర్వాత ఈ చర్యకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించింది. యుఎస్ ప్రాదేశిక జలాలపై స్పై బెలూన్‌ను తమ యుద్ద విమానాలు కూల్చివేశాయని తెలిపింది. యూఎస్ టీవీ నెట్‌వర్క్‌లలోని ఫుటేజీలు చిన్న పేలుడు తర్వాత బెలూన్ సముద్రంలో పడినట్లు చూపించాయి. ఒక ఎఫ్-22 జెట్ ఫైటర్ ఎఐఎం-9ఎక్స్ సైడ్‌విండర్ క్షిపణితో ఎత్తులో ఉన్న బెలూన్‌ను కూల్చివేయడానికి వినియోగించినట్టుగా రక్షణ శాఖ అధికారి ఒకరు విలేకరులతో చెప్పారు. అది స్థానిక కాలమానం ప్రకారం.. 14:39 గంటలకు యూఎస్ తీరానికి ఆరు నాటికల్ మైళ్ల దూరంగా పడిపోయిందని తెలిపారు.
దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ సమీపంలో శిథిలాలు నీటిలో 47 అడుగుల (14మీ) లోతులో( తాము ఊహించిన దానికంటే తక్కువ లోతులో) పడ్డాయని రక్షణ అధికారులు మీడియాకు తెలిపారు. ఇక, ప్రస్తుతం ఏడు మైళ్ల (11 కి.మీ) మేర విస్తరించి ఉన్న బెలూన్ శిథిలాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తోంది. రికవరీ కోసం భారీ క్రేన్‌తో సహా రెండు నౌకాదళ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించారు.
ఇక, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బెలూన్ కూల్చివేతలో పాల్గొన్న ఫైటర్ పైలట్లను అభినందించారు. ‘‘వారు దానిని విజయవంతంగా తొలగించారు. ఈ పనిని చేసిన మా ఏవియేటర్స్ నేను అభినందించాలనుకుంటున్నాను’’ అని బైడెన్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. ‘‘ఈ బెలూన్ తొలుత జనవరి 28న అలస్కాలోని యూఎస్ గగనతలంలోకి ప్రవేశించింది. జనవరి 30 సోమవారం కెనడియన్ గగనతలంలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత జనవరి 31న ఉత్తర ఇడాహో మీదుగా యూఎస్ గగనతలంలోకి తిరిగి ప్రవేశించింది. బెలూన్ యూఎస్ భూభాగం దాటిన తర్వాత.. అది తిరిగి బహిరంగ జలాల్లోకి వెళ్లలేదు. ఇది షూట్‌డౌన్ కష్టతరం చేసింది’’అని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఇక, ఈ పరిణామాలపై చైనా స్పందించిది. పౌర మానవరహిత విమానాలపై దాడి చేయడానికి యుఎస్ బలాన్ని ఉపయోగించడంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి, నిరసన వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ వ్యవహారాలకు తీవ్రమైన ఉల్లంఘన అని చైనా పేర్కొంది. ఇందుకు అవసరమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఇక, చైనా అధికారులు దానిని గూఢచర్య బెలూన్ కాదని తెలిపారు. అది దారితప్పిన వాతావరణ గగన నౌక అని చెప్పారు.