ప్రధాని మోదీ హయాంలో యూఏఈతో సంబంధాలలో పరివర్తన జరిగింది.. కేంద్ర మంత్రి జై శంకర్

By Sumanth KanukulaFirst Published Dec 13, 2022, 11:01 AM IST
Highlights

భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం యూఏఈలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ 2022ను ప్రారంభించారు. ఈ వేదికపై నుంచి భౌగోళిక రాజకీయ దృశ్యం, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి జై శంకర్ కీలక ప్రసంగం చేశారు. 
 

భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం యూఏఈలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ 2022ను ప్రారంభించారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్.. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక ప్రముఖులను ఒకచోట చేర్చే వేదికగా నిలుస్తోంది. ఇండియా గ్లోబల్ ఫోరమ్ యూఏఈ 2022కు ‘‘పాట్నర్స్ ఫర్ గ్లోబల్ ఇంప్యాక్ట్’’ థీమ్‌గా ఉంది. ఈ వేదికపై నుంచి భౌగోళిక రాజకీయ దృశ్యం, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి జై శంకర్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ..  స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి మాట్లాడారు.  ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ భాగస్వాములతో సహకరించే అవకాశాల గురించి చర్చించారు. అలాగే వాటి సవాళ్ల గురించి మాట్లాడారు. 

‘‘గ్లోబలైజేషన్ విస్తృతంగా ఉన్నందున.. మరింత రీబ్యాలెన్సింగ్, ఎక్కువ మల్టీపోలారిటీ ఉంటుంది’’ అని కేంద్ర మంత్రి జై శంకర్ వివరించారు. యూఏఈ-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా యూఏఈతో భారత్‌కు బలమైన బంధం ఉందని పేర్కొన్నారు. యూఏఈ భారతదేశం మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందన్నారు. అలాగే రెండో అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉందని.. విదేశాలలో మరెక్కడా లేనంత ఎక్కువ భారతీయ పౌరులను కలిగి ఉన్న దేశంగా ఉందని చెప్పారు ఇది భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. 

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో మా సంబంధాలలో నిజమైన పరివర్తన జరిగింది. ముఖ్యంగా సీఈపీఏ (యూఏఈ-ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం]తో పెరుగుతున్న వాణిజ్యం, పెట్టుబడులను ఇది కవర్ చేస్తుంది. స్పేస్, ఎడ్యూకేషన్, ఏఐ, హెల్త్,  స్టార్ట్-అప్‌లు వంటి రంగాలలో మేము సహకరించుకుంటున్నాం’’ అని జై శంకర్ చెప్పారు. 

రాబోయే సంవత్సరాల్లో ఈ బంధం పునర్నిర్వచించబడుతుందని, ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఇతర అంతర్జాతీయ భాగస్వాములకు కూడా విస్తుందని చెప్పారు. రెండు దేశాలు చాలా కాలంగా ఒకరినొకరు తెలుసుకోవడం, గత రెండు దశాబ్దాలలో సంబంధాన్ని తిరిగి కనుగొనడంలో చాలా సౌకర్యంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి ముఖ్యమైన భాగస్వాములను ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ పోషిస్తున్న పాత్రకు మంత్రి జై శంకర్ అభినందనలు తెలిపారు.


 

click me!