ఉక్రెయిన్ తర్వాత ఫిన్లాండ్‌పై యుద్ధం! నాటో కూటమిలో చేరతామని ఫిన్లాండ్ ప్రకటన.. పొరుగు దేశానికి రష్యా వార్నింగ్

By Mahesh KFirst Published May 13, 2022, 3:01 PM IST
Highlights

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా తదుపరి దాని మిలిటరీని ఫిన్లాండ్‌పైకి ప్రయోగించనుందా? ఈ అనుమానాలు ఎందుకంటే.. నాటో కూటమిలో చేరతామని ఫిన్లాండ్ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రులు ప్రకటించారు. దీనిపై రష్యా వెంటనే స్పందించింది. దీంతో మిలిటరీ టెక్నికల్ ప్రతీకార చర్యలను రష్యా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
 

న్యూఢిల్లీ: ఇప్పటికే రష్యా.. పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నది. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెరతీసిన సంగతి తెలిసిందే. నాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూనే రష్యా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. తద్వారా ఇతర పొరుగు దేశాలు నాటో వైపు చేరబోవనే ఆలోచన కూడా ఇందులో ఉన్నది. కానీ, రష్యా ఆలోచనలకు భిన్నమైన పరిణామాలు ఎదురు వస్తున్నాయి. తాజాగా, రష్యా పొరుగు దేశం ఫిన్లాండ్ కూడా నాటోలో చేరతామనే ప్రకటన చేసింది. నాటో కూటమి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటామని ఫిన్లాండ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రకటించారు. దీనికి కారణం రష్యానే అని, ‘మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి’ అంటూ రష్యాపై ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్తో మండిపడ్డారు.

నాటో కూటమిలో చేరడంపై ఫిన్లాండ్ పార్లమెంటులో ఇంకా చర్చ జరగాల్సి ఉన్నది. నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ, ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఆ దేశం నాటో కూటమిలో చేరడానికి గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగానే అర్థం అవుతున్నది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఫిన్లాండ్ మాత్రమే కాదు.. స్వీడన్ కూడా ఇదే ఆలోచనల్లో ఉన్నది.

ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడి చేయడం ప్రారంభించగానే ఫిన్లాండ్, స్వీడన్ దేశ ప్రజల అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నాటో కూటమిలో చేరడానికి అనుకూలమైనట్టు కథనాలు వచ్చాయి. రష్యా తమపైనా దాడి చేయడానికి వెనుకాడబోదని, కాబట్టి, నాటో కూటమి రక్షణ తీసుకోవడం ఉత్తమం అనే నిర్ణయాలకు ప్రజలు వస్తున్నట్టు వివరించాయి. 

కాగా, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఈ రెండు దేశాలకు ఆహ్వానం పలికారు. నాటో కూటమిలో చేరడానికి ఉత్సాహపడుతున్న ఈ రెండు దేశాలను తాము స్వాగతిస్తున్నామని వివరించారు. కాగా, రష్యా మాత్రం ఫిన్లాండ్ దేశానికి వార్నింగ్ ఇచ్చింది. నాటో కూటమిలో చేరే ప్రయత్నాలు చేస్తే ఆ దేశంపై ప్రతీకార చర్యలు తీసుకోవడానికి రష్యాను పురికొల్పినట్టు అవుతుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరిచింది. రష్యా భద్రతకు ముప్పుగా భావించి ఆ దేశం నాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.

click me!