పార్లమెంటులో బలం ఒక్క సీటే.. కానీ, ప్రధానిగా ఛాన్స్.. శ్రీలంక పీఎంగా నేడు రానిల్ విక్రమ్ సింఘే ప్రమాణం

By Mahesh KFirst Published May 12, 2022, 3:30 PM IST
Highlights

శ్రీలంక పార్లమెంటులో యూఎన్‌పీకి ఒకే సీటు ఉన్నది. ఈ పార్టీ చీఫ్ రానిల్ విక్రమ్ సింఘే మాత్రమే గత ఎన్నికల్లో గెలిచాడు. ఇప్పుడు ఆయనే శ్రీలంక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఆయన ప్రమాణం చేస్తాడనే వార్తలు ఉన్నాయి. ఆయనకు అధికార, ప్రతిపక్ష వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
 

న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దేశంలో అస్థిరత కారణంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్ష, ప్రధానులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ప్రదర్శన చేస్తుండగా పీఎం మహీంద రాజపక్స అనుచరులు వారిపై దాడికి దిగడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజులపాటు హింసాత్మక ఆందోళనలు జరిగాయి. సుమారు 250 మంది గాయపడగా ఎనిమిది మంది మరణించినట్టు చెబుతున్నారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో అనూహ్య నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభానికి కొంత సమయం ముందు ప్రభుత్వం ప్రతిపక్షాన్నీ కూడా అధికారంలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

దేశంలో హింసాత్మక ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో మహీంద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నావల్ బేస్‌లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద రాజపక్స సోదరుడు, దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నూతన ప్రధాని కోసం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా, రానిల్ విక్రమ్ సింఘే ఈ రోజు శ్రీలంక ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నట్టు తెలిసింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం రానిల్ విక్రమ్ సింఘే.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో సమావేశం అయ్యారు.

పార్లమెంటులో ఒకే సీటు
రానిల్ విక్రమ్ సింఘే ఇది వరకు నాలుగు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ ప్రధానిగా స్వీకరించారు. కానీ, గత పార్లమెంటు ఎన్నికల్లో రానిల్ విక్రమ్ సింఘే పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణంగా తుడిచిపెట్టుకుపోయింది. 225 స్థానాలున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే పురాతనమైన ఈ పార్టీ కేవలం ఒకే సీటు గెలిచింది. గెలిచింది కూడా ఆ పార్టీ చీఫ్ రానిల్ విక్రమ్ సింఘే మాత్రమే. ఇప్పుడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. కానీ, దేశంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే బంపర్ ఆఫర్ వచ్చింది.

విపక్షాల మద్దతు?
ప్రధానమంత్రిగా రానిల్ విక్రమ్ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు పార్లమెంటులో మెజార్టీ మద్దతు లభిస్తుందని ఆయన పార్టీ యూఎన్‌పీ చైర్మన్ వజీరా అబెయవర్దనే తెలిపారు. అధికారపక్షం శ్రీలంక పోదుజన పేరమునా పార్టీ, ప్రధాన ప్రతిపక్ష వర్గం సమాగి జన బలవేగయా సహా ఇతర పార్టీలు రానిల్ విక్రమ్ సింఘేకు మద్దతు ఇస్తారని రాజకీయవర్గాలు తెలిపాయి.

click me!