
Russia Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా మధ్య (russia ukraine crisis) భీకర పోరు కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి ఇరు సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు కీలక నగరాలను హస్తగతం చేసుకోవాలని రష్యా బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో దీటుగా ఎదురుదాడి చేస్తున్నారు. రెండు దేశాలను యుద్ధం నుంచి వెనక్కి రప్పించేందుకు గాను ప్రపంచదేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య రెండో విడత శాంతి చర్చలు (russia ukraine peace talks) బెలారస్-పోలండ్ సరిహద్దు ప్రాంతంలో జరిగాయి. కానీ, ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.
కానీ, యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించినట్లు రష్యన్ సంధానకర్తలు ధృవీకరించారు.కాల్పులు, రాకెట్ దాడుల్లో సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
రెండో రౌండ్ చర్చలు ముగిశాయి. దురదృష్టవశాత్తు, ఉక్రెయిన్ కోరిన డిమాండ్లను రష్యా ప్రతినిధులు అంగీకరించకపోవడంతో చర్చలు అసంతృప్తిగా ముగిశాయి.కానీ, యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ట్విట్టర్‌లో తెలిపారు.
తాజా చర్చల్లో ప్రధానంగా.. సైనిక ఘర్షణల్లో బాధపడుతున్న ప్రజలను, పౌరులను రక్షించాలని ప్రత్యేక కారిడార్లను ఏర్పాటుకు ఒప్పుకున్నట్టు రష్యా ప్రధాన సంధానకర్త, మాజీ సాంస్కృతిక మంత్రి వ్లాదిమిర్ మెడిన్స్కీ చెప్పారు. ప్రత్యేక కారిడార్లను సమీప భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్నట్లు రష్యన్ సంధానకర్త, జాతీయవాద చట్టసభ సభ్యుడు లియోనిడ్ స్లట్స్కీ అన్నారు. గత వారం ఉక్రెయిన్‌పై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడి ప్రారంభించినప్పటి నుండి కనీసం 350 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ పేర్కొంది. భారీ ఎత్తున సాక్ష్యాలు ఉన్నప్పటికీ, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా పేర్కొంది.
ఇదే సమయంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.