
ఉక్రెయిన్, రష్యాల మధ్య కాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే చర్చలకు కొన్ని గంటల ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా పోరాట యోధులం అని అన్నారు. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. రష్యా సైనికులు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే తమ దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించారు. రష్యా వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు సైనిక అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తామని చెప్పారు. తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ సైనికులు మరణించారని జెలెన్ స్కీ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా వరుసగా ఐదో రోజు యుద్దాన్ని కొనసాగిస్తుంది. ఓ వైపు యుద్దం జరుగుతుండగానే ఇరు దేశాలు చర్చలకు సిద్దమయ్యాయి. మరికాసేపట్లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల బృందాలు బెలారస్‌కు చేరుకన్నాయి. రష్యాతో చర్చల ప్రధాన లక్ష్యం తక్షణ కాల్పుల విరమణ, తమ దేశం నుంచి రష్యన్ దళాల ఉపసంహరణ అని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. మరోవైపు పలు ఒప్పందాలకు ఉక్రెయిన్ ఆమోదం తెలపాలని రష్యా కోరుతుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు రష్యాను కోరుతున్నాయి. అయితే ఇప్పటికే రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. అయితే రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ సైన్యం, పౌరులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కీవ్ నగరం తమ ఆధీనంలో ఉందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలు జరగనుండటంతో అన్ని దేశాలు దీనిపై దృష్టి సారించాయి. ఈ చర్చలు ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేకుంటే మరింత ఉద్రిక్తలకు దారి తీస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.