
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతోంది. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు దళాలను అప్రమత్తం చేయడం ద్వారా ఉద్రిక్తతలను మరింత పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితులపై ఉక్రెయిన్ స్పందిస్తూ.. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి తమ సైనికబలగాలు రష్యాకు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్ మిలటరీ పెర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. రష్యా దళాలు దేశంపై 'దాడి వేగాన్ని' తగ్గించాయి. దాదాపు ఐదు రోజుల పోరాటంలో భారీ ప్రాణనష్టాన్ని చవిచూశాయని పేర్కొంది.
ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ సోషల్ మీడియాలో .. రష్యా దాడుల తీవ్రత తగ్గిపోయిందని అన్నారు. రష్యా తమ సైనిక, పౌర స్ధావరాలపై దాడులు కొనసాగిస్తున్నా వారి చర్యలను తాము సవర్థవంగా ఎదుర్కొంటున్నామనీ, రష్యా ఆక్రమణదారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రష్యా వైపు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, శత్రు బలగాలు నైతికస్ధైర్యాన్ని కోల్పోయాయని వెల్లడించారు. ప్రచారార్భాటానికి, వాస్తవ పరిస్ధితికి తేడాలు ఉంటాయని రష్యా గుర్తెరిగిందని ఉద్దేవా చేశారు. తమపై దాడులకు తెగబడ్డ రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ను చూసి భయపడుతున్నదని పెర్కొన్నారు.
అంతకు ముందు ప్రకటనలో రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా దాదాపు 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, 116 మంది చిన్నారులు సహా మరో 1,684 మంది గాయపడ్డారని తెలిపింది. ఇదిలావుండగా, రష్యా తన దళాలు ఉక్రెయిన్ సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ పౌర జనాభా ప్రమాదంలో నెట్టే చర్యలు చేయడం లేదని వెల్లడించింది. అయితే, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధం ఎంతమంది సైనికులు చనిపోయారనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు.
అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి గత ఐదు రోజుల్లో వ్లాదిమిర్ పుతిన్ బలగాలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఇంటెలిజెన్స్ అప్‌డేట్ ఇచ్చింది. అయితే, ఎంత మంది చనిపోయారనే సంఖ్యను ప్రస్తావించలేవు. కానీ ఉక్రెయిన్ మిలిటరీ దినిపై స్పందిస్తూ.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో 5,300 మంది రష్యన్ భద్రత సిబ్బంది మరణించారని పేర్కొంది. ఇదిలావుండగా, రష్యా బలగాలు పెద్ద ఎత్తున్న ఉక్రెయిన్ రాజధాని కైవ్ వైపు వస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కైవ్‌కు ఉత్తరాన 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో భారీ గా బలగాలు ఉన్నాయని చెబుతున్నాయి. దీనికి తోడు రష్యా అధ్యక్షుడు పుతిన్.. న్యూక్లియర్ వెపన్స్ బలగాలను అప్రమత్తం చేయడంపై మరింత ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ప్రపంచ దేశాలు సైతం పుతిన్ తీసుకుంటున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి (ఐరాస) వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంంది.