హెలికాప్టర్ ప్రమాదంలో ఉక్రెయిన్ మంత్రి దుర్మరణం.. 18కి పెరిగిన మృతుల సంఖ్య.. రాజధాని కీవ్ సమీపంలో ఘటన..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2023, 2:28 PM IST
Highlights

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్,  అతని డిప్యూటీ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్,  అతని డిప్యూటీ మరణించినట్లు పోలీసులు తెలిపారు. బ్రోవరీలో స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇంటీరియర్ మినిస్టర్ డెనిస్ మొనాస్టైర్స్కీ, ఆయన డిప్యూటీ యెవెన్ యెనిన్, మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూరీ లుబ్‌కోవిచ్‌తో పాటు సహా 16 మంది మరణించారని పోలీసు చీఫ్ ఇహోర్ క్లైమెంకో తెలిపారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు  కూడా ఉన్నట్టుగా చెప్పారు. 

జనవరి 18 ఉదయం హెలికాప్టర్ కిండర్ గార్టెన్ పక్కన కూలిపోవడంతో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలు, ఉద్యోగులు కిండర్ గార్టెన్‌లో ఉన్నారని తెలిపారు. ప్రమాదంలో హెలికాప్టర్‌లోని వారితో పాటుగా..  అది కూలిన చోట ఉన్నవారు కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమిటనే దానిపై అధికారులు వివరణ ఇవ్వలేదు.

అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత మృతుల సంఖ్య 18కి పెరిగినట్టుగా ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 9 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనలో 10 మంది చిన్నారులు సహా 22 మంది గాయపడ్డారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. ఇక, డెనిస్ మొనాస్టైర్స్కీ విషయానికి వస్తే.. 2021లో ఇంటీరియర్ మినిస్టర్‌గా నియమితులయ్యారు. అతనికి ఇద్దరు పిల్లలు  ఉన్నారు. 

click me!