
కాశ్మీర్‌తో సహా అన్ని ఇరుదేశాల మధ్య నెలకొన్న ముఖ్యమైన సమస్యలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరపాలనే తన కోరికను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన మూడు యుద్దాల తర్వాత తాము గుణపాఠం నేర్చుకున్నామని చెప్పారు. యూఏఈకి చెందిన అల్ అరేబియా న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహబాజ్ షరీఫ్ ఈ కామెంట్స్ చేశారు. అయితే షెహబాజ్ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ స్వరంలో మార్పు వచ్చింది. మళ్లీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. షెహబాజ్ షరీఫ్ ఇంటర్వ్యూపై పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేసింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. 2019 ఆగస్టు 5 నాటి చట్టవిరుద్ధమైన చర్యని వెనక్కి తీసుకున్న తర్వాత మాత్రమే భారత్‌తో తమ చర్చలు జరుగుతాయని పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ చర్యను భారత్ ఉపసంహరించుకోకుండా చర్చలు సాధ్యం కాదని తెలిపింది. కాశ్మీర్ వివాద పరిష్కారం తప్పనిసరిగా ఐకరాజ్య సమితి తీర్మానాలు, జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. అల్ అరేబియా న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారని ప్రధాన మంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి తెలిపారు.
ఇక, ఆ ఇంటర్వ్యూలో తాము పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నట్టుగా షెహబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాక్ గుణపాఠం నేర్చుకుందని, తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. కశ్మీర్‌తో సహా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో సీరియస్‌గా నిజాయితీతో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అయితే కాశ్మీర్‌లో ఏమి జరుగుతుందో దానిని ఆపాలని అన్నారు. ‘‘భారతదేశం చాలా సోదర దేశం. మేము ఎల్లప్పుడూ సోదర సంబంధాలను పంచుకుంటాం. ఇది ప్రత్యేకమైనది. మేము భారతదేశంతో మూడు యుద్ధాలు చేశాం. ఆ యుద్ధాలతో పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుంది. యుద్దాల పర్యవసానంగా మరింత కష్టాలు, నిరుద్యోగం, పేదరికం మాత్రమే ఉన్నాయి. మనం సమస్యలను పరిష్కరించుకోగలిగితే భారత్‌తో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం’’ అని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.
“శాంతియుతంగా జీవించడం, పురోగతి సాధించడమా లేదా ఒకరితో ఒకరు గొడవపడి సమయం, వనరులను వృధా చేసుకోవడమా అనేది మన ఇష్టం. మేము పేదరికాన్ని నిర్మూలించాలని, అభివృద్దిని సాధించాలని, మా ప్రజలకు విద్య, ఆరోగ్య సౌకర్యాలు, ఉపాధిని అందించాలని కోరుకుంటున్నాం. బాంబులు, మందుగుండు సామగ్రి కోసం మా వనరులను వృధా చేయకూడదని అనుకుంటున్నానని.. అదే నేను ప్రధాని మోడీకి ఇవ్వాలనుకుంటున్న సందేశం’’ అని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
రెండు దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని తాను యుఏఈ అధ్యక్షుడిని కోరుతున్నట్టుగా కూడా చెప్పారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీకి నా సందేశం ఏమిటంటే.. మనం కూర్చుని, మాట్లాడుదాం, మన సమస్యలన్నింటినీ టేబుల్‌పైకి తెచ్చుకుందాం. కశ్మీర్‌తో సహా పలు అంశాలకు పరిష్కారాన్ని కనుగొందాం’’ అని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
భారతదేశంలో మైనారిటీలు పీడించబడుతున్నారని పాకిస్తాన్ ఆరోపణలను షెహబాజ్ ఇప్పటికీ పునరావృతం చేశారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుంది. అయితే కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని ఆపాలి’’ అని అన్నారు. ‘‘రెండు దేశాలలో ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. మేము ఈ ఆస్తులను శ్రేయస్సు కోసం ఉపయోగించాలనుకుంటున్నాము. రెండు దేశాలు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావాలనుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
ఇక, ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలు దేశాలను సాయం చేయాలని పాకిస్తాన్ కోరుతుంది. ఇలాంటి సమయంలో భారత్‌తో సంబంధాల గురించి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.