కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రదాడి ముప్పు... అక్కడికి వెళ్లకండి.. : బ్రిటన్

By AN TeluguFirst Published Aug 26, 2021, 4:26 PM IST
Highlights

ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండడంతో... భారీగా ప్రజలు కాబూల్ విమానాశ్రయం సమీపంలో గుమిగూడుతున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

కాబూల్ : ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని, వెంటనే కాబూల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడండంటూ గురువారం అమెరికా, సహా పలు పాశ్చాత్య దేశాలు   తమ ప్రజలను కోరాయి. ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.  తమ పౌరుల భద్రత గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. దాంతో అక్కడి నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండడంతో... భారీగా ప్రజలు కాబూల్ విమానాశ్రయం సమీపంలో గుమిగూడుతున్నారు.

ఈ క్రమంలోనే ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  ‘భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయం సమీపంలో ఉన్న వారంతా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి’ అని యూనియన్ స్టేట్ డిపార్ట్మెంట్ పౌరులను హెచ్చరించింది.  ఆస్ట్రేలియా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  విమానాశ్రయం వద్దకు వెళ్లొద్దని తన ప్రజలకు సూచించింది. 

‘ఇతర మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సురక్షితంగా బయట పడగలిగితే... వెంటనే ఆ పని చేయండి’ అంటూ బ్రిటన్ తన పౌరులను అప్రమత్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలి వెళ్ళే ఉద్దేశంతో సుమారు పది వేల మందికి పైగా ప్రజలు కాబూల్ విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని యూఎస్ ఆర్మీ మేజర్ జనరల్  విలియం టేలర్ మీడియాకు వెల్లడించారు.  

ఆ తరుణంలోనే పలు దేశాల నుంచి హెచ్చరికలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా 24 గంటల వ్యవధిలో 19 వేల మందిని తరలించినట్లు పెంటాగన్ పేర్కొంది.  అలాగే ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా విదేశీయులు, ఆఫ్గాన్ వాసుల్ని తరలించినట్లు చెప్పింది.

click me!