9/11 దాడుల్లో లాడెన్ హస్తం లేదు : అమెరికాపై తాలిబాన్ల షాకింగ్ కామెంట్లు

By telugu teamFirst Published Aug 26, 2021, 3:28 PM IST
Highlights

ఒసామా బిన్ లాడెన్ 9/11 దాడుల్లో పాలుపంచుకున్నాడని అమెరికా ఆరోపించిందని, దాన్ని సాకుగా చూపే ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధానికి దిగిందని తాలిబాన్లు అన్నారు. నిజానికి అది అన్యాయమైన యుద్ధమని వివరించారు. 20 ఏళ్లు గడిచినా ఆ దాడుల్లో లాడెన్ హస్తమున్నట్టు అమెరికా నిరూపించలేకపోయిందని తెలిపారు.

న్యూఢిల్లీ: అమెరికా తీవ్రంగా పరిగణించిన 9/11(2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై దాడి) దాడుల్లో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని తాలిబాన్లు షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధం చేయడానికి అమెరికా ఆ ఆరోపణను ఒక సాకుగా వాడుకుందని అన్నారు. ఓ మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘20ఏళ్ల తర్వాత కూడా 9/11 దాడుల్లో ఒసామా బిన్ లాడెన్ హస్తమున్నదని అమెరికా నిరూపించలేకపోయింది. ఇన్నాళ్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అన్యాయంగా యుద్ధం జరిగింది. ఒసామా బిన్ లాడెన్ ప్రమేయమున్నదనే సాకుతోనే అమెరికా తమపై యుద్ధం చేశారు’ అని ముజాహిద్ అన్నారు. 

తాలిబాన్ల హయాంలో ఆఫ్ఘనిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలకు స్వర్గధామంగా మారుతుందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను ప్రస్తావించగా వాటిపైనా ముజాహిద్ స్పందించారు. ‘లాడెన్ అమెరికాకు ఒక సమస్యగా మారినప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడు. కానీ, 9/11 దాడుల్లో ఆయన ప్రమేయముందని చెప్పడానికి ఒక్క రుజువూ లేదు. ఇప్పుడూ మేం వాగ్దానం చేస్తున్నాం.. ఆఫ్ఘనిస్తాన్ గడ్డను ఇతరులను లక్ష్యం చేసుకునే అడ్డాగా మారనివ్వం’ అని వివరించారు.

తాలిబాన్ల పాలనలో మహిళలపై అరాచకలు చెప్పనలవిగాని రీతిలో ఉంటాయని పలుకథనాలు వస్తున్నాయి. గత హయాంలో మహిళలపై దారుణ ఆంక్షలు అమలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మహిళల గురించీ ముజాహిద్ మాట్లాడుతూ.. ‘మేం మహిళలను గౌరవిస్తాం. వాళ్లు మా సోదరీమణులు. వాళ్లు భయపడకూడదు. తాలిబాన్లు దేశం కోసం పోరాడారు. వాళ్లు మమ్మల్ని చూసి గర్వించాలే గానీ, భయపడకూడదు’ అని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ పౌరులందరూ దేశంలోనే ఉండాలని కోరుకుంటున్నట్టు ముజాహిద్ చెప్పారు. వారు గతంలో ఏం చేసినప్పటికీ, ప్రత్యర్థులకు సహకరించినప్పటికీ వారిని క్షమిస్తున్నామని తెలిపారు. తమ ప్రజలు తమకు కావాలని, యువత, విద్యావంతులు దేశానికి అవసరమని వివరించారు. కానీ, వెళ్లాలనుకుంటే అది వారి ఇష్టమని తెలిపారు. బలవంతంగా వారిని అడ్డుకోబోమని చెప్పారు.

click me!