జీతం ఇవ్వలేదని.. యజమానిని చంపిన ఉద్యోగి..!

By telugu news teamFirst Published Mar 20, 2021, 10:39 AM IST
Highlights

దాంతో యజమాని ఓ కాఫీ షాపు వద్ద కలుద్దామని చెప్పాడు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బాస్‌పై కక్ష పెంచుకున్న అతగాడు.. ముందే ఓ ప్లాస్టిక్ కవర్‌లో కత్తితో అతను చెప్పిన చోటుకు చేరుకున్నాడు. 

నెలలపాటు పని చేయించుకొని జీతం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న యజమానిని ఓ ఉద్యోగి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించిన ఘటన సీసీటీవీ లో రికార్డు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అజ్మాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ యువకుడు అజ్మాన్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. అతనితోపాటు తోటి ఉద్యోగులకు కూడా జీతం ఇవ్వకుండా యజమాని వేధిస్తున్నాడు. దీంతో.. సాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో అతడ్ని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా హత్య జరిగిన ముందురోజు యజమానితో తమ జీతాల విషయమై మాట్లాడాడు నిందితుడు. దాంతో యజమాని ఓ కాఫీ షాపు వద్ద కలుద్దామని చెప్పాడు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బాస్‌పై కక్ష పెంచుకున్న అతగాడు.. ముందే ఓ ప్లాస్టిక్ కవర్‌లో కత్తితో అతను చెప్పిన చోటుకు చేరుకున్నాడు. 

తోటి ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వెంటనే తమకు సాలరీ ఇవ్వాలని యజమానితో అన్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ముందే తనతోపాటు తీసుకెళ్లిన కత్తితో యజమానిని పొడిచాడు. దాంతో బాస్ తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి మరీ గొంతుకోసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి, తాజాగా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో 4 నెలలుగా యజమాని జీతాలు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. తోటి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఇలా బాస్‌ను పొడిచి చంపేసినట్లు కోర్టుకు తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.

click me!