
అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్ కార్డుల మంజూరు కోసం భారత సంతతి వైద్యులు, ఇతర సిబ్బంది గురువారం క్యాపిటల్ భవనం దగ్గర నిరసనకు దిగారు. గ్రీన్ కార్డుల జారీలో అవలంబిస్తున్న దేశాల వారీ పరిమితిని(కంట్రీక్యాప్) ను ఎత్తివేయాలని భారతీయులు నూతన అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు.
గ్రీన్ కార్డుల జారీలో ఆలస్యం వల్ల తాము వేరే చోటుకి, వేరే ఉద్యోగానికి మారలేకపోతున్నామని వారు వాపోయారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం హెచ్-1బీ వీసాపై అగ్రరాజ్యంలో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యం గల భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రబావం చూపుతున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ విదానం వల్ల కేవలం 7 శాతంమంది మాత్రమే గ్రీన్ కార్డులు పొందుతున్నారని తెలిపారు. కాబట్టి కంట్రీ క్యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టోరీ ఉంది. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం’ అని ఆందోళనలో పాల్గొన్నవైద్యులు రాజ్ కర్నాటక్, ప్రణవ్ సింగ్ అన్నారు.
తాము అమెరికాలోనే శిక్షణ పొంది, ఇక్కడే పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల వేరే చోటుకి గానీ, వేరే ఉద్యోగానికి గానీ మారలేకపోతున్నామని వారు వాపోయారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల దశాబ్దాలు గడిచిన గ్రీన్ కార్డులు పొందలేమని, దేశాల వారీ కోటాను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా భారతీయ వైద్యులు డిమాండ్ చేశారు.