afghanistan: విమాన చక్రాలకు కట్టుకుని గాల్లోకి.. కిందపడి ఇద్దరి దుర్మరణం

By telugu teamFirst Published Aug 16, 2021, 4:53 PM IST
Highlights

కాబూల్ నుంచి బయటికి వెళ్తున్న ఓ విమాన చక్రాలకు ఇద్దరు పౌరులు తమను అంటిపెట్టుకున్నారు. కానీ, విమానాశ్రయం నుంచి విమానం కొంత ఎత్తు ఎగరగానే అదుపుతప్పి పై నుంచి కిందపడి వారు దుర్మరణం పాలయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో సాధారణ ప్రజలు మొదలు మంత్రుల వరకు నిస్సహాయులుగా మిగిలారు. తాలిబన్‌ల ఆటవిక పాలన నుంచి బయటపడాలనే ఆరాటంలో పెద్దమొత్తంలో ప్రజలు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ విమానశ్రయానికి పోటెత్తారు. తాము ఇంకా ఎన్ని రోజులు బతుకుతామో తెలీదని స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిబాధ్యతలు చేపట్టినవారే ప్రకటించారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఇంకెంత దుర్భరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థిలకు అద్దంపట్టే దుర్ఘటన కాబూల్‌లో చోటుచేసుకుంది.

విమానంలోకి ఎక్కే అవకాశం లేకపోవడంతో ఇద్దరు పౌరులు ఎలాగైనా దేశం విడిచిపెట్టాలని సంకల్పించి ఆ ఫ్లైట్ చక్రాలకు తమను కట్టుకున్నారు. కాబూల్‌లోని ఎయిర్‌పోర్టులో నుంచి విమానం గాల్లోకి లేవగానే, దానితోపాటు ఆ పౌరులూ ఎగిరారు. కానీ, కొన్ని మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత పట్టుతప్పి వారు చక్రాల నుంచి విడిపోయి వేగంగా నేలపై పడ్డారు. వెంటనే దుర్మరణం పాలయ్యారు. ఆ ఇద్దరు నేలపై పడుతున్న వీడియోపై నెటిజన్లు కలతచెందుతున్నారు.

 

DISCLAIMER: DISTURBING FOOTAGE❗️❗️❗️
Two people who tied themselves to the wheels of an aircraft flying from Kabul, tragically fall down. pic.twitter.com/Gr3qwGLrFn

— Tehran Times (@TehranTimes79)

రెండు రోజుల నుంచి హమీద్ కర్జాయ్ విమానశ్రయమంతటా భీతావహ వాతావరణం నెలకొంది. ఎవరిని చూసినా మృత్యుభయమే. ఎలాగైనా దేశం వదిలి ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంలో విమానాల్లోకి చేర్చే ద్వారాల దగ్గర క్యూలు కట్టారు, కుస్తీలుపట్టారు. సోమవారమైతే ఓ విమానం ఎక్కే చోట చిన్నపాటి తొక్కిసలాటే జరిగింది. ఇదే తరుణంలో ప్రజలు చెదురగొట్టడానికి అమెరికా బలగాలు గాల్లోకి కాల్పలు జరిపాయి. కొంత సేపటికే తాలిబన్లూ కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఇప్పటికి ఐదుగురు చనిపోయినట్టు తెలిసింది.

click me!