afghanistan: నేడు కాబూల్‌కు తాలిబన్ నాయకత్వం.. ‘అంతర్జాతీయ మద్దతు’పై చర్చ

By telugu teamFirst Published Aug 16, 2021, 2:05 PM IST
Highlights

ప్రజల ద్వారా ఎన్నికైన దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలిన మరుసటి రోజు తాలిబన్ నాయకత్వం రాజధాని కాబూల్‌కు వెళ్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, అంతర్జాతీయ మద్దతు పొందడంపై చర్చలు జరపనున్నారు. అష్రఫ్ ఘనీని తజకిస్తాన్ తిరస్కరించడంతో ఒమన్ చేరారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల యుద్ధానికి తెరదించి దేశరాజధానిని తాలిబన్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సోమవారం నగరమంతా పెట్రోలింగ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది చెక్‌పోస్టులను వెనక్కిమళ్లగా తాలిబన్లు చెక్‌పోస్టులను తమ చేతుల్లోకి తీసుకున్నారు. తర్వాత ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను చేరుకున్నారు. అధికారాన్ని పంచుకుందామని ప్రభుత్వం ఇది వరకే చేసిన ప్రతిపాదనను తాలిబన్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అద్యక్షుడు హమీద్ కర్జాయ్, హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సలేషన్ హెడ్ అబ్దుల్లా
అబ్దుల్లా, మాజీ ప్రధానమంత్రి గుల్బుద్దీన్  హెక్‌మత్యార్‌లు తాలిబన్‌లతో చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

‘అంతర్జాతీయ మద్దతు’ ప్రభుత్వ అస్త్రం:
అధికారాన్ని పంచుకోవాలన్న ప్రతిపాదనపై చర్చ జరగకున్నా.. శాంతి చర్చలకు వచ్చిన అబ్దుల్లా అబ్దుల్లా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని మాజీ అధ్యక్షుడని స్పష్టం చేశారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ముందు తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతనూ ప్రకటించడం గమనార్హం. జలాలీ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడిగా ఉంటారని వివరించారు. ఈ పరిణామాలు జరుగుతున్నప్పటికీ శాంతి చర్చలో పాల్గొనే ప్రతినిధులు తాలిబన్లకు అంతర్జాతీయ మద్దతు తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మద్దతు కోసం తాలిబన్ల ప్రభుత్వం ఎలా ఉండాలనేదానిపై చర్చ జరగనుంది. ఇందుకోసం తాలిబన్ నాయకత్వం నేడు దేశరాజధాని కాబూల్‌కు చేరనుంది. ఇప్పటికే తాలిబన్లు దాడులు చేయబోమని తెలిపిన సంగతి తెలిసిందే. అధికారం తమ చేతుల్లోకి వచ్చినట్టేనని, ఇక ప్రభుత్వాన్ని నిలుపుకోవడం, ప్రజలను పాలించడం తమ ముందున్న పరీక్ష అని వివరించింది.

యూఎస్‌కు అష్రఫ్ ఘనీ:
తాలిబన్లు ఆదివారం కాబూల్ నగర సరిహద్దుకు చేరగానే అప్పటి దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలివెళ్లారు. అనంతరం ఓ ప్రకటనలో రక్తపాతాన్ని నిరోధించడానికే తాను దేశాన్ని వీడినట్టు వెల్లడించారు. తొలుత ఆయన విమానంలో తజకిస్తాన్‌కు బయల్దేరారు. కానీ, తజకిస్తాన్‌ ఆయనను స్వీకరించలేదు. విమాన ల్యాండింగ్‌ను తిరస్కరించింది. దీంతో అష్రఫ్ ఘనీ ఒమన్ వెళ్లాడు. ప్రస్తుతం ఆయన ఒమన్‌లోనే ఉన్నాడు. ఆయనతోపాటు జాతీయ భద్రత సలహాదారు మోహిబ్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ త్వరలోనే ఒమన్ నుంచి అమెరికాకు వెళ్లనున్నట్టు తెలిసింది.

click me!