
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలి వెళ్లిపోవడం, తాలిబన్ నాయకత్వం కాబూల్‌కు చేరనుండటంతో వారి అధికార ప్రకటన రేపో మాపో అన్నట్టుగా ఉన్నది. రెండు దశాబ్దాలు అమెరికా, నాటో, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో గెరిల్లా తరహాలో దాడులు చేసి పట్టు నిలుపుకున్న తాలిబన్లు ఎవరు? ఎలా పుట్టింది? దానికి నిధులు ఎలా వస్తాయి? అధికారాన్ని చేపట్టాక వారి పాలన ఎలా ఉండనుంది? వంటి వివరాలను పరిశీలిద్దాం..
తాలిబన్ అంటే ఏమిటీ?
తాలిబన్ అంటే పాస్థో భాషలో విద్యార్థి అని అర్థం. మతపరమైన విద్యార్థులు. తాలిబన్ ఉద్యమానికి తూర్పు, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని పష్టున్ ఏరియాలో బీజం పడింది. సోవియట్‌లపై పోరాడిని ముజాహిదీన్ గ్రూపులతో ఈ ఉద్యమానికి బలం చేకూరింది. 1980లో ఆఫ్ఘనిస్తాన్‌లో వామపక్ష భావాలుగల ప్రభుత్వానికి అండగా దేశంలోకి చేరిన సోవియట్ సేనలపై పోరాడిన ముజాహిదీన్ ఫైటర్‌లతో ఏర్పడిందే తాలిబన్ సంస్థ అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ముల్లా మొహమద్ ఒమర్ 1994లో తాలిబన్‌ను స్థాపించాడు. 1994లో దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో తాలిబన్ ప్రబలశక్తిగా పరిణమించి 1996 కల్లా దేశంలోని చాలా భూభాగాల్లో పట్టుసాధించింది.
ప్రస్థానం:
1996 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు దాదాపు దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుని షరియా చట్టాలను కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. ఇదే కాలంలో అల్ ఖైదా తాలిబన్లకు సన్నిహితమైంది. అప్పటి అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ తాలిబన్ ప్రభుత్వం నీడలో తలదాచుకున్నాడు. అప్పటికే వారు 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ కూల్చేశారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అమెరికా ప్రభుత్వం లాడెన్‌ను అప్పగించాల్సిందిగా తాలిబన్‌ను ఆదేశించింది. కానీ, ఆ టవర్స్‌ను కూల్చేసింది అల్ ఖైదా అనే నిరూణలేవీ లేవని, అలా ఉంటే అప్పగిస్తామని మొండికేసింది. దీంతో అమెరికా సేనలు తాలిబన్‌లపై దాడికి దిగారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లోకీ ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా బలగాలతో దాదాపు రెండు దశాబ్దాలపాటు తాలిబన్లు పోరాడారు. 2018లో తాలిబన్లు, అమెరికా శాంతి చర్చలు ప్రారంభించగా 2020నాటికి ఒప్పందం కుదిరింది. అమెరికా బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియకు కట్టుబడింది. ఈ నెలాఖరుతో అమెరికా సేనలు వెనక్కితీసుకుంటామని ప్రకటించిన యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే చాలా వరకు బలగాలను వెనక్కి తీసుకెళ్లారు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం తాలిబన్లకు సులువైంది.
నిధులెలా వస్తాయి?
అతివాద ఇస్లాం గ్రూపు తాలిబన్ ఉగ్రవాద సంస్థ అనేక మార్గాల్లో తన మనుగడకు నిధులను సమకూర్చుకుంటున్నది. ఇందులో ఓపియం, డ్రగ్స్ ట్రేడ్ ప్రముఖంగా ఉన్నాయి. వారి అధీనంలోని ప్రాంతాల్లో సాగు, వ్యాపారాలపై పన్నులు వసూలు చేసుకుంది. అంతేకాదు, దాని సానుభూతిపరుల నుంచీ నిధులు స్వీకరిస్తున్నది.
అధికారంలోకి వస్తే పాలన ఇలా?
1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన తాలిబన్లు కఠిన షరియా చట్టాలను అమలు చేసింది. హత్య, వివాహేతర సంబంధాల్లో దోషులకు బహిరంగంగా అనాగరికంగా చంపేసింది. రాళ్లతో విసిరి చంపేసే శిక్షలను అమలు చేసింది. పురుషులు గడ్డం గీసుకోవద్దు. మహిళలు తమ మొత్తం దేహాన్ని బుర్ఖాతో కవర్ చేసుకోవాలి. మహిళలు బయటి పనికి వెళ్లరాదు. బాలికలు పాఠశాలకు వెళ్లవద్దు. మహిళలు ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే బంధువైన పురుషుడితో కలిసి బుర్ఖా ధరించి వెళ్లాలి. మ్యూజిక్, సినిమా, టీవీలపై నిషేధం ఉంటుంది. అయితే, ఇటీవలే తాము మహిళలకు హక్కు కల్పించాలని భావిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. కానీ, కాందహార్‌ను ఆక్రమించుకున్నాక ఓ బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను ఇంటికి తీసుకెళ్లి మళ్లీ ఉద్యోగాలకు రావొద్దని కరాఖండి చెప్పేశారు. వారి ఉద్యోగాల్లోకి ఆ మహిళల బంధువులైన పురుషులు రావాలని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు అధికారాన్ని చేపట్టాక ఈ చట్టాలను దేశంలోని పౌరులందరూ పాటించడానికి ఒత్తిడి చేసే అవకాశముంది.