ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం..!

By telugu news teamFirst Published Jan 12, 2021, 10:11 AM IST
Highlights

ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్టు ట్విటర్ సంస్థ వెల్లడించింది. తాజాగా ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు వస్తున్న సుమారు 70వేల ఖాతాలను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరో సంచల నిర్ణయం తీసుకుంది. ఇటీవల ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. ఆయనకు అనుకూలంగా ఉన్న 70వేల ఖాతాలను బ్లాక్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజధాని వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై గత బుధవారం ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో దాడులను ప్రోత్సహిస్తూ హింసను ప్రేరేపించే విధంగా ట్రంప్ పోస్టులు ఉండడంతో గత శుక్రవారం ఆయన ఖాతాను ట్విటర్ మొదట 12 గంటలు నిలిపివేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్టు ట్విటర్ సంస్థ వెల్లడించింది. తాజాగా ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు వస్తున్న సుమారు 70వేల ఖాతాలను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

"వాషింగ్టన్ విధ్వంసం దృష్ట్యా, హింసను ప్రేరేపించే విధంగా పోస్టులు పెట్టిన వారి ఖాతాలను శాశ్వతంగా తొలిగించే ప్రక్రియను ప్రారంభించాం. ఈ ఘటనకు సంబంధించి ట్వీట్లలో హింసాత్మక కంటెంట్ ఉన్నవారి ఖాతాలను పూర్తిగా తొలగిస్తున్నాం. దీనిలో భాగంగా తాజాగా 70వేల ఖాతాలను శాశ్వతంగా తొలగించడం జరిగింది." అని ట్విటర్ పేర్కొంది. అటు ట్రంప్ అనుకూల పోస్టులపై ఫేస్‌బుక్ కూడా చర్యలు చేపట్టింది.

 ట్రంప్ మద్దతుదారులు ట్రెండ్ చేస్తున్న 'ఆమోదం ఆపండి' అనే పదం ఉన్న పోస్టులను తొలగించింది. "నిబంధనలు ఉల్లంఘించే ఎలాంటి పోస్టులున్న తొలగించేందుకు వెనుకాడేదిలేదు. హింసను ప్రేరేపించే తప్పుడు సమాచారం ఆపేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం." అని కేపిటల్ ఘటనను ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా సంస్థ పేర్కొంది. 

click me!