అమెరికన్లకు బైడెన్ తీపి కబురు...!

By telugu news teamFirst Published Jan 11, 2021, 2:17 PM IST
Highlights

ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. దీంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బైడెన్ ఈ నెల 20వ తేదీన అధికార బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.  కాగా.. అలా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే బైడెన్ అమెరికా ప్రజలకు తీపికబురు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా కారణంగా అవస్థలుపడిన యువతకు ఉద్దీపన ప్యాకేజీ అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలో కరోనా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. దీంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది. కాగా.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాజాగా అమెరికా ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిరుద్యోగులకు, మహమ్మారి కారణంగా ఆర్థికంగా చితికిపోయిన వారికి 600 డాలర్ల ఆర్థిక సహాయం అందుతోంది. కాగా.. దీనిపై గత వారం స్పందించిన బైడెన్.. ఎగువ, దిగువ సభల్లో తమ పార్టీకి మెజార్టీ వస్తే.. అమెరికన్లకు అందే ఆర్థిక సహాయాన్ని 2000డాలర్లకు పెంచుతామంటూ ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం రోజు మరోసారి ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. 

‘అమెరికన్లకు 600డాలర్ల ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోదు. ఆహారానికి, అద్దే చెల్లించడానికి ఇది చాలదు’ అని అన్నారు. ఈ క్రమంలో అమెరికన్లకు ప్రస్తుతం అందుతున్న ఆర్థిక సహాయాన్ని బైడెన్ పెంచే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ నేతలు ప్రస్తుతం రెండు సభల్లో పట్టు సాధించారు. ఈ క్రమంలో జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికన్లకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని పెంచుతూ బైడెన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

click me!