ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్‌కు ఓటేసిన ట్విట్టర్ వాటాదారులు

By Mahesh KFirst Published Sep 14, 2022, 1:06 AM IST
Highlights

ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్‌కు ట్విట్టర్ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌ను ఈ డీల్‌తో ఎలన్ మస్క్‌కు అమ్మడానికి వాటాదారులు అంగీకారం తెలిపారు. ఎలన్ మస్క్ తన డీల్‌ను నిలుపుకుని ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ట్విట్టర్ కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో ఈ ఓటింగ్ జరిగింది.

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ కొనుగోలు పై ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తాను ట్విట్టర్‌ను ఎంతకు కొనాలని అనుకుంటున్నారో కూడా వెల్లడి చేశారు. 44 బిలియన్ డాలర్లు పెట్టి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ఎలన్ మస్క్ అనుకున్నారు. అయితే, అంతకు ముందు తనకు ట్విట్టర్‌లో అకౌంట్లు కలిగి ఉన్న బాట్‌ల సంఖ్యను చూపించాలని డిమాండ్ పెట్టారు. దీనిపై ట్విట్టర్ రియాక్ట్ అయింది. కొంత సంఖ్యను కూడా ఎలన్ మస్క్‌కు తెలిపింది. కానీ, ఆ సంఖ్యతో ఎలన్ మస్క్ విభేదించారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో బాట్లు ట్విట్టర్ హ్యాండిల్స్ ఆపరేట్ చేస్తున్నాయనేది ఆయన వాదన. ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుకు ఎక్కింది.

ట్విట్టర్ కొనుగోలు డీల్ నుంచి ఎలన్ మస్క్ దాదాపు వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ట్విట్టర్ వైపు నుంచి కీలక సమాచారం అందింది. ఎలన్ మస్క్ డీల్‌కు సై అని ట్విట్టర్ షేర్ హోల్డర్స్ అంటున్నట్టు ఓ వార్త వచ్చింది. ఎలన్ మస్క్ చేసిన 44 బిలియన్ డాలర్ల ఆఫర్‌కు ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌ను విక్రయించడానికి షేర్ హోల్డర్లు అంగీకరించినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నదని ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. ట్విట్టర్ షేర్ హోల్డర్లు సమావేశం అయ్యారు. ఈ భేటీ కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే సాగింది. ఇందులో ఎలన్ మస్క్ డీల్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ డీల్‌ను సమర్థిస్తూ చాలా మంది షేర్ హోల్డర్లు ఆన్‌లైన్‌లో ఓటేశారు. ప్రాథమిక లెక్కల ప్రకారం.. ఎక్కువ మంది షేర్ హోల్డర్లు ఎలన్ మస్క్ కొనుగోలు డీల్‌కు ఆమోదం తెలిపినట్టు కనిపిస్తున్నదని ట్విట్టర్ పేర్కొంది.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదన నుంచి దాదాపు ఎలన్ మస్క్ వెనుకడుగు వేస్తున్నారు. ఈ సమయంలో పై సమాచారం రావడం గమనార్హం. అయితే, ఎలన్ మస్క్ తన డీల్‌ను కంప్లీట్ చేయాలని ట్విట్టర్ ఓ పిటిషన్ వేసింది. దీనిపై అక్టోబర్‌లో విచారణ ప్రారంభం కానుంది.

click me!