ఇరాన్ లో జంట పేలుళ్లు.. 95 మంది దుర్మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత్

By Sairam Indur  |  First Published Jan 4, 2024, 2:31 PM IST

Iran blast : ఇరాన్ లో జరిగిన భారీ జంట పేలుళ్లను భారత్ ఖండించింది. ఈ ఘటనపై తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. 


Iran blast : ఇరాన్ లోని కెర్మన్ నగరంలో జరిగిన భయంకరమైన జంట బాంబు పేలుళ్లలో 95 మంది మరణించారు. ఈ ఘటనపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు భారత్ సంఘీభావం తెలిపిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. 

‘‘ఇరాన్ లోని కెర్మన్ సిటీలో జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్లు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. మా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉన్నాయి’’ అని జైస్వాల్ ట్వీట్ చేశారు.

We are shocked and saddened on the terrible bombings in the Kerman City of Iran. At this difficult time, we express our solidarity with the government and people of Iran.

Our thoughts and prayers are with the families of the victims and with the wounded.

— Randhir Jaiswal (@MEAIndia)

Latest Videos

undefined

2020లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ దివంగత జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రాజధాని టెహ్రాన్ కు ఆగ్నేయంగా 820 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన సమాధి వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం వల్ల మరణాల సంఖ్య కూడా అధికంగా నే ఉంది. మొదటి పేలుడు జరిగిన 20 నిమిషాల తర్వాత రెండో పేలుడు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది.

మొదట్లో మృతుల సంఖ్య 103 అని అధికారులు తెలిపినా.. బాధితుల జాబితాలో కొందరి పేర్లు పునరావృతమయ్యాయని గుర్తించారు. దీంతో ఆ సంఖ్యను 95కు తగ్గించినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి బహ్రామ్ ఎనోల్లాహి పేర్కొన్నారు. 200 మందికి పైగా గాయపడ్డారు. కాగా.. ఇరాన్ లో ఒకప్పుడు శక్తిమంతమైన వ్యక్తి అయిన సులేమానీ రివల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్ కు అధిపతిగా ఉన్నారు. 2020 జనవరి 3న బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమయ్యాడు. ఆయన అంత్యక్రియల సమయంలో కూడా తొక్కిసలాట జరిగి 56 మంది మరణించారు

ఇరాన్ అత్యున్నత నాయకుడైన అయతుల్లా అలీ ఖమేనీ.. సులేమానీ జీవించిన ఉన్న సమయంలోనే 'సజీవ అమరవీరుడు'గా ప్రకటించారు. ఆయన ఇరాక్, సిరియా రెండింటిలోనూ ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూపును ఓడించడంలో కీలక పాత్ర పోషించినందుకు హీరోలా కొలిచారు. అయితే ఈ తాజా పేలుళ్లలకు తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరూ ప్రకటించలేదు. అయితే ఈ పేలుడుకు ఉగ్రవాదులే కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.

click me!