
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓవైపు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతోన్న ట్రంప్ మరోవైపు ఇతర దేశాల వ్యవహారాలను సైతం శాసిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా తన పూర్తి మద్ధతును అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా మద్ధతు నిలుస్తున్నామని, హమాస్ తమ మాట వినకపోతే ఎవరూ సురక్షితంగా ఉండరన్నారు. బందీలను వెంటనే విడుదల చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాజాను వదిలి వెళ్ళిపోవాలని, హమాస్ బందీలను ఉంచుకుంటే గాజా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అక్కడి ప్రజలను సైతం ట్రంప్ హెచ్చరించారు.
కాగా ట్రంప్ గాజా ప్రజలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. గాజా ప్రజల కోసం ఒక మంచి భవిష్యత్తును ఎదురు చూస్తుందన్న ట్రంప్, అయితే అది బందీలను విడుదల చేసేంత వరకు సాధ్యం కాదని అన్నారు. ఒకవేళ ఇందుకు సహకరించకపోతే గాజా భవితవ్యం ప్రమాదంలో పడడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్ బందీలతో వైట్ హౌజ్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిని విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరితో సమావేశం తర్వాత ట్రంప్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.