
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా(Russia) యుద్ధంలో నంబర్ వన్ టార్గెట్ తానే అని ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన కుటుంబం టార్గెట్‌గా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేశారు గానీ.. దేశం విడిచి వెళ్లి తలదాచుకోవడానికి ఆయన నిరాకరించారు. అమెరికా ఆయనకు ఆఫర్ చేసినా తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నా.. ఇప్పటి వరకు ఆయనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. మరో షాకింగ్ న్యూస్ ఏమంటే.. ఆ హత్యా ప్రయత్నాలను నిలువరించడానికి కూడా రష్యా ఇంటెలిజెన్స్‌లోని కొన్ని వర్గాల నుంచే అందిందని సమాచారం.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు(Murder Attempt) జరిగాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపేయడానికి రెండు గ్రూపులు వాగ్నర్ గ్రూప్, చెచెన్ రెబెల్స్‌ను పురమాయించినట్టు సమాచారం.
అయితే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపేయడానికి బయల్దేరిన చెచెన్ గ్రూపు గురించి రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్‌బీ)లోని కొన్ని వర్గాలే ఉక్రెయిన్ అధికారులను అప్రమత్తం చేసినట్టు వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. అయితే, ఆ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌లో యుద్ధాన్ని వ్యతిరేకించేవారూ ఉన్నట్టు సమాచారం. ఆ వర్గాల నుంచే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్యాయత్నం గురించి సమాచారాన్ని లీక్ చేశారని తెలిసింది. ఈ సమాచారం అందగానే అధికారులు రంగంలోకి దిగారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్య గురించి బయల్దేరిన చెచెన్ గ్రూపును నాశనం చేసినట్టు శనివారం రాజధాని కీవ్ నగర శివార్లలో ఈ బృందాన్ని అంతమొందించినట్టు ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రెటరీ ఒలెసక్సీ డానిలొవ్ వివరించారు.
వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు బయల్దేరిన చెచెన్ గ్రూపులను శనివారం చంపేసినట్టు తెలిపారు. వీరి గురించి తమకు ఎఫ్ఎస్‌బీ నుంచే సమాచారం అందిందని, అందులోని కొన్ని యుద్ధ వ్యతిరేక మనుషుల నుంచి ఈ సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. అదే విధంగా జెలెన్‌స్కీని హతమార్చాలని ప్రయత్నించిన వాగ్నర్ గ్రూపు కూడా ఉక్రెయిన్ అధికారులు తమ కదలికలను అంత కచ్చితంగా అంచనా వేయడంపై ఆందోళన చెందినట్టు సమాచారం. ఉక్రెయిన్ అధికారుల చాకచక్యం వాగ్నర్ గ్రూపులో కలకలం రేపినట్టు తెలిసింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరినప్పుడే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ రక్షణ గురించి ఆందోళనలు వెలువడ్డాయి. అప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనా రష్యా పలుచోట్ల దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆ దేశ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీకి ఓ ఆఫర్ ఇచ్చింది. కీవ్‌లోకి రష్యా సేనలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజధాని నగరం నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. తాము ఉక్రెయిన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అని వివరించింది. ఇదే ఆఫర్ అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఆఫర్‌ను తిరస్కరించారు.
‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకానీ.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు. తాను దేశం వదిలి రాలేనని, పోరాటానికి సహకరించాలని సూచించారు.
గత శనివారం రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని పలు సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. కీవ్ నగరం చుట్టూ సైన్యం పట్టుబిగించే పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆఫర్ చేసింది.