
పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో పాఠశాలల దుస్థితిపై ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని దాదాపు 11,000 స్కూల్స్‌లో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ.. చదువుకోవడానికి విద్యార్థులు మాత్రం లేరు. స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏ పని చేయకుండానే.. వారికి రావాల్సిన జీతాలను సక్రమంగా తీసుకుంటున్నారని పాకిస్తాన్ మీడియా రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రికలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ఈ పాఠశాలలు ప్రభుత్వ పరిమిత వనరులపై భారంగా ఉన్నాయని రుజువు చేస్తున్నాయి.
11,000 మంది ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న జీతాలు ప్రభుత్వ ఖాజానాపై భారాన్ని పెంచుతున్నాయి. ఈ పాఠశాలలకు విద్యార్థులెవరూ రాకపోవడంతో కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు వీటిని అతిథి గృహాలుగా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. సింధు ప్రావిన్స్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది విద్యార్థులకు 1.8 పాఠశాలలు ఉన్నాయి. కేవలం 15 శాతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.
అంతే కాదు ఈ పాఠశాలల్లో కనీస వసతులు కూడా సరిగా లేవు. చాలా పాఠశాలల్లో పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్లు, ఆట స్థలం, సరిహద్దు గోడ వంటి తగిన సౌకర్యాలు లేవు. అయితే ఈ స్కూల్స్ నమోదును పొందుతున్నాయి.. అయితే ఇప్పుడు ఆ సంఖ్య స్తబ్దుగా ఉంది. ప్రావిన్స్‌లో పాఠశాలల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడ 49,000 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. మాధ్యమిక పాఠశాలల సంఖ్య 2,000 కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉందని నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించడం.. వారికి మెరుగైన జీతాలు అందజేయడం.. అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సింధు ప్రావిన్స్ అధికారులను విమర్శకులు కోరారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులో ఉన్న హైటెక్ వాటిని కాకపోయినా కనీసం ప్రాథమిక సౌకర్యాలను అందించాలని వారు కోరుతున్నారు.