దీర్ఘకాలం కరోనా లక్షణాలున్నవారికి.. అధిక రోగనిరోధక శక్తి: అధ్యయనం

By telugu teamFirst Published Aug 21, 2021, 7:18 PM IST
Highlights

కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో సోకినవారిలో లేదా మహమ్మారితో దీర్ఘకాలం బాధపడినవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉండే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. టీకా కూడా దీర్ఘకాలిక లక్షణాలు నయం చేయడంలో కీలకపాత్ర వహిస్తుందని తెలిపింది.
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై అమెరికాలోని రట్జర్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్‌తో దీర్ఘకాలం బాధపడినవారిలో లేదా తీవ్రత ఎక్కువగా అనుభవించినవారిలో రోగనిరోధక శక్తిపాళ్లు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన రట్జర్ యూనివర్సిటీ మహమ్మారి ప్రారంభం నుంచి అధ్యయనం చేసింది. భిన్న ప్రాంతాల నుంచి 548 హెల్త్‌కేర్ వర్కర్లు, 283 మంది సాధారణ వ్యక్తులపై ఈ అధ్యయనం జరిపింది.

అధ్యయనం మొదలైన తొలి ఆరు నెలల్లోనే మొత్తం 831 పార్టిసిపేంట్లలో 93 మంది కరోనాబారిన పడ్డారు. వీరిలో 24 మందిలో తీవ్ర కరోనా లక్షణాలు కనిపించగా 14 మందిలో లక్షణాలు కనిపించలేవు. మొత్తం పాజిటివ్‌లలో పదిశాతం మందిలో నిస్సత్తువ, శ్వాస సమస్య, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు నెల వరకు కొనసాగాయి. మరో పదిశాతం మందిలో కనీసం నాలుగు నెలల వరకు లక్షణాలు కొనసాగాయని అధ్యయన పత్రం వెల్లడించింది.

తీవ్ర లక్షణాలు కలిగిన 96శాతం మందిలో మంచిస్థాయిలో యాంటీబాడీలు కనిపించాయని అధ్యయనం తెలిపింది. అధ్యయనకర్తల్లో ఒకరైన డేనియల్ బీ హార్టన్ అధ్యయనం గురించిన కీలక సమాచారాన్ని పంచుకున్నారు. టీకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక లక్షణాలనూ నయం చేస్తాయని వివరించారు. కరోనా బారిన పడ్డవారిలో నాడీసంబంధ మార్పులూ చోటుచేసుకుంటాయని, మెదడు మొద్దుబారడం, జ్ఞాపకశక్తి, చూపు మందగించడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అయితే, లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే, యాంటీబాడీలు అదే స్థాయిలో ఎక్కువగా ఉంటాయని, ఎక్కువ కాలమూ బాడీలో కొనసాగుతాయని వివరించారు.

click me!